వినోదం కోసం ఆడే పేకాట అనైతికం కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సాధారణంగా పేకాట అనగానే చాలా మందికి జూదం, బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలే గుర్తుకు వస్తాయి. అయితే, జూదం లేదా పందెం కట్టే ఉద్దేశం లేకుండా, కేవలం వినోదం కోసం ఆడే పేకాటను అనైతిక చర్యగా పరిగణించలేమని సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 26 May 2025 12:03 PM ISTసాధారణంగా పేకాట అనగానే చాలా మందికి జూదం, బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలే గుర్తుకు వస్తాయి. అయితే, జూదం లేదా పందెం కట్టే ఉద్దేశం లేకుండా, కేవలం వినోదం కోసం ఆడే పేకాటను అనైతిక చర్యగా పరిగణించలేమని సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. కర్ణాటకకు చెందిన హనుమంతరాయప్ప వైసీ అనే వ్యక్తి ఒక సహకార సంఘానికి డైరెక్టర్‌గా ఎన్నికయ్యాడు. అయితే, అతడిపై గతంలో పేకాట కేసు నమోదై, శిక్ష పడడంతో అధికారులు అతని ఎన్నికను రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో తన ఎన్నిక రద్దును సవాల్ చేస్తూ హనుమంతరాయప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "పేకాట ఆడుతూ పట్టుబడిన హనుమంతరాయప్పతో పాటు మరికొందరికి ఎటువంటి విచారణ లేకుండానే రూ.200 జరిమానా విధించినట్లు గుర్తించాం. కేవలం ఇంత తక్కువ జరిమానా విధించడం, అది కూడా విచారణ లేకుండా జరగడం, ఇది తీవ్రమైన నేరం కాదని సూచిస్తుంది" అని ధర్మాసనం అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలను మరింత స్పష్టం చేస్తూ, "మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడటంలో చాలా విధానాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో అనైతిక చర్య దాగి ఉంటుందని చెప్పడం కష్టం. ప్రత్యేకించి బెట్టింగ్ లేదా జూదం ఉద్దేశం లేకుండా, కేవలం వినోదం కోసం ఆడే ఆటలో అనైతిక చర్య ఉందని చెప్పడం ఇంకా కష్టం" అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు పేకాటపై ఉన్న సాధారణ అపోహలను తొలగించేలా ఉన్నాయి. ఒక వ్యక్తి జూదం ఆడాలనే ఉద్దేశం లేకుండా, కేవలం సరదా కోసం ఆడితే, అది పెద్ద తప్పుగా పరిగణించలేమని కోర్టు తేల్చి చెప్పింది.
ఈ కేసులో పిటిషనర్ హనుమంతరాయప్పకు పడిన శిక్షతో అతని ఎన్నికను రద్దు చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. "అందువల్ల ఈ కేసులో పిటిషన్‌దారుకు పడిన శిక్షతో ఆయన ఎన్నికను పక్కన పెట్టడం సరికాదు. ఆయన ఎన్నిక చెల్లుతుంది. తన పదవీకాలం ఉన్నంతవరకు కొనసాగుతారు" అని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో హనుమంతరాయప్పకు ఊరట లభించడమే కాకుండా, వినోదం కోసం ఆడే కొన్ని రకాల ఆటలపై చట్టపరమైన అపోహలను కూడా సుప్రీంకోర్టు తొలగించినట్లయింది. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఒక మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.
