'పరువు నష్టం'పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఇక డిఫమేషన్ కేసు వేయవచ్చా..?
పరువు నష్టం (Defamation) అనే కేసుపై భారత న్యాయ వ్యవస్థలో చాలా కాలంగా చర్చ జరుగుతూ వస్తోంది.
By: Tupaki Desk | 23 Sept 2025 12:25 PM ISTసమాజంలో గౌరవంగా జీవించడం పౌరుడి ప్రాథమిక హక్కు. ఆ హక్కుకు భంగం వాటిల్లితే అది ఏ రూపంలోనైనా సరే.. సదరు వ్యక్తి పరువు నష్టం కేసు వేసుకొని న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. పరువు నష్టం (Defamation) అనే కేసుపై భారత న్యాయ వ్యవస్థలో చాలా కాలంగా చర్చ జరుగుతూ వస్తోంది. మాటల ద్వారా, రచనలు, లేదంటే ప్రచురణల ద్వారా ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీస్తే బాధిత వ్యక్తి పరువునష్టం కేసు వేసుకోవచ్చు. అయితే అది కేవలం పౌర న్యాయ పరిధిలో ఉండాలా? లేదంటే శిక్షార్హ నేరంగా పరిగణించాలా? అన్న ప్రశ్న ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.
న్యాయమూర్తి వ్యాఖ్యలు ఇవే..
ఒక కేసు విషయంలో న్యాయమూర్తి ఈ విషయాన్ని మరోసారి తెరమీదకు తెచ్చారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ‘ది వైర్’ అనే ఆన్‌లైన్ పబ్లికేషన్‌పై వేసిన పరువు నష్టం కేసు విచారణ సందర్భంలో న్యాయమూర్తి ఎంఎం సుందరేశ్ మాట్లాడుతూ ‘వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం నేరం కాదని నిర్ధారించాల్సిన సమయం వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు కొత్త ఆలోచనలు రేకెత్తించినట్లు కనిపిస్తోంది. గతంలో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) లోని సెక్షన్ 499 అనేది డెఫమేషన్ క్రిమినల్ అఫెన్స్. అయితే బీఎన్ఎస్ లో దీన్ని సెక్షన్ 356 కిందికి తెచ్చారు. ఇది శిక్షకు అర్హమైన నేరం. ది వైర్ పబ్లికేషన్ విషయంలో న్యాయమూర్తి సుందరేశ్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.
2016లో చట్టబద్ధత కల్పించే సుప్రీం కోర్టు..
ఇది ఇలా ఉంటే 2016లో సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు సమయంలో డెఫమేషన్ కు రాజ్యాంగ బద్ధతను కల్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ‘జీవించే హక్కు అంటే కేవలం ప్రాణాలతో ఉండడం మాత్రమే కాదని, గౌరవంగా కూడా ఉండేదని’ కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల ఇతరులు వ్యక్తుల గౌరవాన్ని కించపరిచే చర్యలు తీసుకుంటే శిక్షార్హమని ఈ తీర్పు వెల్లడించింది. అప్పుడు అలా చెప్పిన న్యాయస్థానం ఇప్పుడు దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో చర్చ మొదలైంది.
అసలు సమస్య ఇదే..
పరువు నష్టం అనేది వ్యక్తికి సంబంధించినది. అయితే దానిపై పరిహారం పొందాలంటే సివిల్ సూట్ల ద్వారా పొందవచ్చు. కానీ దానిని క్రిమినల్ ఆఫెన్స్‌గా మార్చడం వల్ల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ (మాటల స్వేచ్ఛ)పై ప్రభావం పడుతుంది. ఇందులో ఎక్కువగా ఇరుక్కునేది జర్నలిస్టులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు.. వీరు ఎప్పుడూ ఈ కేసుల చుట్టే తిరుగుతుంటే.. సమాజానికి మేలు చేసే విమర్శ ఉండదు. ఇది సమాజంలో మార్పును తీసుకురాలేదు.
మార్పులు అవసరం అన్న న్యాయవాది..
అదే సమయంలో, గౌరవం కూడా వ్యక్తి ప్రాథమిక హక్కు కిందకే వస్తుంది. ఎవరైనా కావాలనే అసత్య ప్రచారం చేసి వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీయడం అనుమతించదగిన విషయం కాదు. కాబట్టి ఈ సమస్యలో సమతుల్యత ముఖ్యం. మాటల స్వేచ్ఛను కాపాడుకోవాలి, కానీ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే అవకాశాలను నిరోధించాలి. డెఫమేషన్ చట్టంలో మార్పులు రావాలని కపిల్ సిబాల్ లాంటి సీనియర్ న్యాయవాదులు చెప్పడం ప్రాముఖ్యత సంతరించుకుంది. పరువు నష్టం నేరం కాదని భావిస్తే, బాధితులకు పరిహారం అందించే సివిల్ సూట్లను మరింత బలంగా, త్వరితగతిన పరిష్కరించే విధానాలను రూపొందించాలి. న్యాయం ఆలస్యం అవుతుంది, బాధితులకు అన్యాయం జరుగుతుంది.
సామాజిక చర్చకు నాంది పలికి న్యాయమూర్తి వ్యాఖ్యలు..
సుప్రీం తాజా వ్యాఖ్యలు ఒక న్యాయ-సామాజిక సంభాషణకు నాంది పలికినట్లే. భవిష్యత్తులో ఇది చట్టపరమైన సంస్కరణలకు దారితీయవచ్చు. స్వేచ్ఛ, గౌరవం అనే రెండు ప్రాథమిక విలువలను రక్షించే సమతుల్య పరిష్కారం కనుగొనడం మన న్యాయ వ్యవస్థకు ఒక సవాలు.
