భాషకు మతాన్ని అంటగట్టలేం.. అది సార్వజనీనం: సుప్రీంకోర్టు
దేశంలో భాషలకు సంబంధించిన రాజకీయాలు పెరిగి పోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 16 April 2025 4:00 PM ISTదేశంలో భాషలకు సంబంధించిన రాజకీయాలు పెరిగి పోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. భాషకు మతంతో సంబంధంలేదని.. ఎక్కడి వారు ఏ భాషైనా మాట్లాడవచ్చు.. పాటించవచ్చునని తేల్చి చెప్పింది. అంతేకాదు.. భాషకు ఒక మతాన్ని అంటగట్టి.. దానిని తప్పని చెప్పలేమని స్పష్టం చేసింది ఈ మేరకు.. సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు.. సదరు పిటిషన్ కూడా.. కొట్టి వేసింది.
ఏం జరిగింది?
మహారాష్ట్రలో మరాఠీ తప్ప మరో భాష అంటే.. అక్కడి వారికి మంట. ఒకసారి శాసన సభలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు.. హిందీలో మాట్లాడారని.. అక్కడే శివసేన సభ్యులు చితక్కొట్టేశారు. ఇది అప్పట్లో పెను వివాదంగా మారింది. సో.. దీనిని బట్టి.. మహారాష్ట్రలో భాషా ప్రేమికుల గురించిప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలపై కొందరు మరాఠాతోపాటు.. ఉర్దూ భాషలోనూ పేర్లు, హోదాలు రాశారు. ఇక, సదరు మున్సిపల్ కౌన్సిల్‌లో జరిగే పనులన్నీ మరాఠీలో కాకుండా.. ఉర్దూలోనూ పేర్కొన్నారు.
దీనిని సవాల్ చేస్తూ.. కౌన్సిల్ పెద్దలు కోర్టును ఆశ్రయించారు. ఉర్దూ భాషలో పేర్కొన్న నేమ్ ప్లేట్లను, సాగిస్తున్న వ్యవహారాలను కొట్టివేయాలని.. కేవలం మరాఠా భాషలోనే నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. అయితే.. ఈ విషయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా రియాక్ట్ అయింది. ``భాష అనేది సమాజానికి, ప్రాంతానికి, ప్రజలకు చెందింది. ఒక మతానికి సంబంధించినది కాదు. భాష అనేది ఒక సంస్కృతి. సమాజం, ప్రజల నాగరికత పురోగతిని కొలవడానికి ఒక కొలమానం`` అని వ్యాఖ్యానించడంతోపాటు.. ఉర్దూ పై నిషేధం విధించలేమని తేల్చి చెప్పింది.
సరిగ్గా కేంద్రానికి!
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రానికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో హింది వ్యవహారంలో ప్రభుత్వాలే వ్యతిరేకిస్తున్న దరిమిలా.. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం.. కేంద్రం మరింత దూకుడు పెంచే అవకాశం ఉంటుందని అంటున్నారు. హిందీని పరాయి భాషగా చూడాల్సిన అవసరం లేదన్న వాదనను కేంద్రం వినిపించేందుకు చాన్స్ వచ్చిందని చెబుతున్నారు.
