ఆమె ఆస్తి హక్కు అత్తింటికే.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..
సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు హిందూ వారసత్వ చట్టంలో ఒక కీలకమైన అంశాన్ని ఎత్తి చూపింది.
By: Tupaki Desk | 25 Sept 2025 3:53 PM ISTకొన్ని కొన్ని కేసుల్లో సుప్రీం చేసే వ్యాఖ్యలు, ఇచ్చే తీర్పులు సమాజానికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇలాంటిదే ఇటీవల ఒక కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుపై అందరూ స్వాగతిస్తున్నారు. సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు హిందూ వారసత్వ చట్టంలో ఒక కీలకమైన అంశాన్ని ఎత్తి చూపింది. పిల్లలు లేని హిందూ వితంతువు మరణిస్తే, ఆమె ఆస్తి తన భర్త కుటుంబంలోని వారసులకు మాత్రమే చెందుతుందని కోర్టు పేర్కొనడం చట్టపరంగానే కాక సామాజిక పరంగా కూడా విస్తృత చర్చకు దారితీస్తోంది.
స్పష్టమైన అవగాహన లేకపోవడమే లోపం..
ఇప్పటి వరకూ ఈ అంశంపై స్పష్టమైన అవగాహన లేకపోవడంతో అనేక కేసులు కోర్టుల్లో మగ్గుతున్నాయి. ముఖ్యంగా, కొవిడ్-19 కాలంలో ఒకే సమయంలో యువ దంపతులు మరణించారు. ఈ యువ దంపతుల కేసు దీనికి ప్రాథమిక కారణంగా నిలుస్తుంది. మొదట భర్త మరణించాడు. ఆ తర్వాత కొంత కాలానికి భార్య మరణించింది. అయితే వారికి సంతానం లేదు. దీంతో ఆస్తిపై హక్కు ఎవరికి ఉంటుందన్న ప్రశ్న తలెత్తింది. మొదట భర్త చనిపోయాడు కాబట్టి భార్యకే ఆస్తి దక్కుతుంది. ఆ తర్వాత భార్య కూడా మరణించింది కాబట్టి అది ఒంటి మహిళ ఆస్తి కిందకు వస్తుంది. సదరు వితంతువు తల్లికా? లేక ఆమె భర్త తరపు కుటుంబానికా? అనేది వివాదానికి దారితీసింది. చివరికి, భర్త తరపు వారసులకే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చింది.
జస్టిస్ వ్యాఖ్యలపై కేసులకు బలం..
ఈ కేసులో న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యలు ఈ తీర్పునకు మరింత బలం చేకూర్చాయి. ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె భర్త గోత్రంలోకి వెళ్తుంది. ఆ గోత్రానికి సంబంధించిన వారసత్వ చట్టాలు ఆమెను అన్వయింపడతాయని ఆమె గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఒక వేళ ఆ మహిళకు పిల్లలు లేకపోతే లేదా మనవళ్లు లేకపోతే ఆస్తి భర్త కుటుంబానికే చెందుతుందని తీర్పులో స్పష్టంచేశారు.
వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు..
అయితే ఈ తీర్పు కొన్ని కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒక మహిళ తన జీవితకాలంలో కూడబెట్టిన సంపద తన తల్లిదండ్రులకు లేదా తల్లి కుటుంబానికి ఎందుకు చెందకూడదు? మహిళా స్వాతంత్ర్యం, ఆమె కృషి ఫలితాలపై సంపూర్ణ హక్కు అనేవి ఇక్కడ రెండో స్థానం పొందుతున్నాయా? ఈ తీర్పు చట్టపరంగా సరైనదే అయినా.. సమానత్వ దృష్టిలో కొంత అసమతుల్యత కనిపిస్తోంది.
చట్ట సవరణ అవసరం..
భవిష్యత్తులో ఇలాంటి వారసత్వ వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే చట్టాన్ని మరింత స్పష్టంగా, మారుతున్న విలువలకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి స్త్రీ కేవలం భర్త కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు. ఆమెకు స్వతంత్ర వ్యక్తిత్వం ఉంది, ఆర్థిక స్వావలంబన ఉంది. చట్టం కూడా ఆ వాస్తవాన్ని ప్రతిబింబించాలి. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని మధ్యవర్తిత్వానికి తరలించి, చట్టబద్ధతపై విచారణను వాయిదా వేసింది. నవంబర్‌లో తదుపరి విచారణలో మరిన్ని స్పష్టతలు వెలువడవచ్చు. కానీ ఇప్పటికీ ఈ తీర్పు, స్త్రీ ఆస్తి హక్కులపై కొత్త చర్చలకు దారితీస్తున్నది ఒప్పుకోవాల్సిన నిజం.
