Begin typing your search above and press return to search.

భావ స్వేచ్ఛ దుర్వినియోగం.. రక్షణ కల్పించలేం..సుప్రీం స్పష్టీకరణ

భావ ప్రకటనా స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యంలో కీలకమైనది. అయితే, దీనికీ కొన్ని పరిమితులు ఉంటాయి.. హద్దులు మీరితే పరిణామాలు ఎదుర్కొనాల్సి కూడా.

By:  Tupaki Desk   |   14 July 2025 9:00 PM IST
భావ స్వేచ్ఛ దుర్వినియోగం.. రక్షణ కల్పించలేం..సుప్రీం స్పష్టీకరణ
X

భావ ప్రకటనా స్వేచ్ఛ.. ప్రజాస్వామ్యంలో కీలకమైనది. అయితే, దీనికీ కొన్ని పరిమితులు ఉంటాయి.. హద్దులు మీరితే పరిణామాలు ఎదుర్కొనాల్సి కూడా. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భావ ప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగం అవుతున్నదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

మీడియాలో భావ ప్రకటనా స్వేచ్ఛకు అవకాశాలు ఎక్కువ. అందుకనే ప్రజాస్వామ్యం మనుగడలో నాలుగో స్తంభం అని కూడా అంటారు. అయితే, భావ ప్రకటనా స్వేచ్ఛ దారి తప్పుతున్న విషయం ఇటీవల పలు సందర్భాల్లో బయటపడింది. మరీ ముఖ్యంగా కళాకారులు, కార్టూనిస్టులు, స్టాండప్ కమెడియన్లు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టీకరించింది.

కార్టూనిస్టు హేమంత్ మాలవీయ కేసులో తీర్పు చెబుతూ.. భావ స్వేచ్ఛ దుర్వినియోగం నేపథ్యంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం అని తేల్చి చెప్పింది. ఆయన వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ పై వేసిన హేమంత్ మాలవీయ వేసిన కార్టూన్ వివాదాస్పదమైంది. ఇది అభ్యంతరకరంగా ఉందని.. ఆయనపై కేసు నమోదైంది. దీంతో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ హేమంత్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం తదుపరి విచారణ జరపనుంది.

హేమంత్ మాలవీయ తనపై నమోదైన కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ నెల 3న విచారణ జరిపిన కోర్టు.. ఆయన విచక్షణ మరిచి కార్టూన్ వేశారని పేర్కొంది. పిటిషన్ ను తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు.

కాగా, దేశంలో కొవిడ్ వ్యాప్తి సమయంలో హేమంత్ మాలవీయ ఈ వివాదాస్పద కార్టూన్ వేశారు. టీకా వేసుకుంటే ఏమవుతుందోననే భయాలు, తప్పుడు సమాచారంపై ఆందోళన నేపథ్యంలో కార్టూన్ వేసినట్లు హేమంత్ కోర్టుకు తెలిపారు. ఒక పౌరుడికి రాజకీయ నాయకుడు టీకా వేస్తున్నట్లు మాత్రమే ఉందని ఎవరినీ కించపరిచేలా లేదని పేర్కొన్నారు.