Begin typing your search above and press return to search.

సేఫ్టీ పేరుతో పిల్లల ఇంటర్నెట్‌పై ఆంక్షలు వద్దు: సుప్రీంకోర్టు

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   17 Oct 2026 9:00 PM IST
సేఫ్టీ పేరుతో పిల్లల ఇంటర్నెట్‌పై ఆంక్షలు వద్దు: సుప్రీంకోర్టు
X

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు భద్రత కల్పిస్తున్నామనే పేరుతో వారిని ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరం చేయడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం ఇంటర్నెట్ పొందే హక్కు పిల్లలకు కూడా ప్రాథమిక హక్కేనని అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్ భద్రత మరియు పిల్లల స్వేచ్ఛకు సంబంధించిన ఈ కీలక తీర్పు వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇంటర్నెట్ పిల్లల ప్రాథమిక హక్కు:

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక అంశంపై విచారణ జరిపింది. పిల్లల రక్షణ పేరుతో వారి ప్రైవసీ, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని కోర్టు తెలిపింది. ఇక ఆన్‌లైన్‌లో సమాచారాన్ని తెలుసుకునే, నేర్చుకునే మరియు ఇతరులతో పంచుకునే హక్కు ప్రతి చిన్నారికి ఉంటుందని వివరించింది. పిల్లల భద్రత ఎంత ముఖ్యమో, వారి స్వేచ్ఛను కాపాడటం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసింది.

చదువుకు, సృజనాత్మకతకు ఇంటర్నెట్టే ఆధారం:

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ అనేది కేవలం వినోదానికే కాక ఆలోచనలు, సృజనాత్మకత మరియు విద్యకు వేదికగా మారిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యా సమాచారాన్ని పొందేందుకు ఇంటర్నెట్ ఒక్కటే ప్రధాన ఆధారంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపింది. ఇక ఒకవేళ ఇంటర్నెట్‌పై లీగల్‌గా నిషేధం విధిస్తే, పిల్లలు దాన్ని పొందేందుకు మరింత ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

అడల్ట్ కంటెంట్‌పై ఆంక్షలకు గ్రీన్ సిగ్నల్;

అయితే, ఇంటర్నెట్ పిల్లలకు పూర్తిగా సురక్షితమైనది కాదని కోర్టు కూడా అంగీకరించింది.. అలా అని వారిని పూర్తిగా దూరం పెట్టడం పరిష్కారం కాదని తేల్చిచెప్పింది. పిల్లల వయస్సుకు తగిన భద్రతా చర్యలు, నియంత్రణ విధానాలు రూపొందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి వదిలేసింది. ఇక పిల్లలకు హానికరమైన అడల్ట్ కంటెంట్ వెబ్‌సైట్ల వంటి నిర్దిష్ట సేవలపై ఆంక్షలు విధించడానికి తమ వ్యాఖ్యలు ఎలాంటి అడ్డంకి కాదని స్పష్టం చేసింది.

జాతీయ డేటాబేస్ ఏర్పాటుకు ఆదేశం:

ఆన్‌లైన్ వేదికల్లో పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన హానికరమైన కంటెంట్‌ను తక్షణమే గుర్తించి తొలగించే వ్యవస్థలను బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక దీని కోసం సమగ్ర జాతీయ డేటాబేస్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం సూచించింది.

ఇక డిజిటల్ ప్రపంచంలో పిల్లల హక్కులను కాపాడుతూనే వారి భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలను ఇచ్చింది. ఇక ఆంక్షలతో బంధించడం కంటే, సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వాలు, సమాజం ముందున్న ప్రధాన బాధ్యత అని ఈ తీర్పు తేల్చిచెప్పింది.