Begin typing your search above and press return to search.

భరణంగా బీఎండబ్ల్యూ కారు, రూ.12 కోట్లు... సీజేఐ కీలక వ్యాఖ్యలు!

అవును... 18 నెలల వైవాహిక బంధం అనంతరం భర్త నుంచి విడాకులు కోరిన ఒక మహిళ.. భరణంగా రూ.12 కోట్లు, ముంబయిలో ఇల్లు, బీఎండబ్ల్యూ కారు కావాలని అడిగారు. దీంతో... సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

By:  Tupaki Desk   |   23 July 2025 1:16 PM IST
భరణంగా బీఎండబ్ల్యూ కారు, రూ.12 కోట్లు... సీజేఐ కీలక వ్యాఖ్యలు!
X

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక విడాకుల కేసు విచారణ సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 18 నెలల పాటు వైవాహిక బంధంలో కొనసాగిన ఒక మహిళ.. తన భర్త నుంచి భరణంగా కోరిన కోరికలు సంచలనంగా మారగా... ఈ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

అవును... 18 నెలల వైవాహిక బంధం అనంతరం భర్త నుంచి విడాకులు కోరిన ఒక మహిళ.. భరణంగా రూ.12 కోట్లు, ముంబయిలో ఇల్లు, బీఎండబ్ల్యూ కారు కావాలని అడిగారు. దీంతో... సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా... కేసును విచారించిన సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ మహిళ డిమాండ్‌ ను విని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసు వివరాల ప్రకారం.. సదరు మహిళ ఎంబీఏ పట్టభద్రురాలు కావడంతో పాటు ఐటీ రంగంలో నిపుణురాలిగా పని చేశారు. అయితే తనకు మానసిక సమస్య ఉండటంతో తన భర్త తన నుంచి విడాకులు కోరుతున్నారని, తన బిడ్డను కూడా తనకు ఇవ్వడం లేదని ఆరోపించిన మహిళ.. ముందుగా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో ఆమె డిమాండ్లకు ఆ కోర్టు అంగీకారం తెలిపింది.

దీంతో భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే విచారణ జరపిన న్యాయస్థానం షాకింగ్ కామెంట్లు చేసింది. ఇందులో భాగంగా... ఉన్నత చదువులు చదివి, సొంతంగా సంపాదించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో భరణం అడగడం సరికాదని సీజేఐ బీఆర్ గవాయ్ సదరు మహిళకు సూచించారు.

వివాహం అయ్యి 18 నెలలు మాత్రమే అయ్యాయని.. అప్పుడే విడాకులు తీసుకునే వారు బీఎండబ్ల్యూ కారు కావాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. మీరు ఎందుకు ఉద్యోగం చేసి అవన్నీ సంపాదించుకోకూడదని మహిళను అడిగారు. మీకు ఫుల్ డిమాండ్ ఉందని.. బెంగళూరు, హైదరాబాద్... మీరు కూడా ఎందుకు పని చేయకూడదు? అని ప్రశ్నించారు!

ఈ సందర్భంగా స్పందించిన ఆ మహిళ... తన భర్త ధనవంతుడని, అదే సమయంలో తాను మానసిక సమస్యలతో బాధ పడుతున్నానని.. అందుకే అతడే తనకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడని తెలిపింది. ఈ సమయంలో... తన వైద్యం కోసం ఖర్చు ఎక్కువ అవుతుందనే కారణంతోనే భరణం అడుగుతున్నట్లు కోర్టుకు వివరించింది.

గతంలో తాను ఉద్యోగం చేసేదానినని.. అయితే, తన భర్త ఉద్యోగాన్ని వదులుకోవాలని సూచించడంతో ఆ ఉద్యోగం మానేశానని పేర్కొంది. ఈ క్రమంలో... ఇరు పక్షాల వాద్దనలు చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా.. భరణంగా భర్త నుంచి ముంబయిలో ఇల్లు, రూ.4 కోట్ల నగదు ఇప్పిస్తామని తెలిపారు. ఇదే సమయంలో... బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఉద్యోగం చేసుకోవాలని మహిళకు సూచించారు.