Begin typing your search above and press return to search.

తీవ్ర సస్పెన్స్ గా సునీల్ నాయక్ ఎపిసోడ్.. గుంటూరు కోర్టు Vs బిహార్ కోర్టు

బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం తీవ్ర సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ను అరెస్టు చేయాలని ఏపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   27 Feb 2026 8:15 PM IST
తీవ్ర సస్పెన్స్ గా సునీల్ నాయక్ ఎపిసోడ్.. గుంటూరు కోర్టు Vs బిహార్ కోర్టు
X

బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం తీవ్ర సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ను అరెస్టు చేయాలని ఏపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత సోమవారం పట్నాలో ఆయనను అరెస్టు చేయగా, అక్కడి కోర్టు ట్రాన్సిట్ వారెంటు జారీ చేయలేదు. దీంతో సునీల్ నాయక్ ను బిహార్ పోలీసులు తమతో తీసుకుపోయారు. ఇక ఈ వ్యవహారంపై ఆయన పట్నా హైకోర్టును ఆశ్రయించగా, మార్చి 2వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఉండగానే గుంటూరు మొబైల్ కోర్టు సునీల్ నాయక్ అరెస్టుకు వారెంటు జారీ చేస్తూ ఆదేశాలిచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో సునీల్ నాయక్ అరెస్టు సస్పెన్స్ గానే కొనసాగుతోంది.

సునీల్ నాయక్ ఎపిసోడ్ రెండు రాష్ట్రాల పోలీసులకు న్యాయవ్యవస్థకు సవాల్ విసురుతోందని అంటున్నారు. బిహార్ కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు కాకుండా ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగం సహకరిస్తోందని ప్రచారం జరుగుతోంది. సునీల్ నాయక్ అరెస్టు సమయంలో గత సోమవారం బిహార్ హోంగార్డ్సు విభాగానికి చెందిన సిబ్బంది భారీగా మోహరించి అవాంతరాలు సృష్టించారని అంటున్నారు. అదే సమయంలో సీనియర్ పోలీసు అధికారిణి ఒకరు ఏపీ పోలీసు బృందంపై దుర్బాషలకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఏపీ పోలీసులు తగిన పత్రాలు సమర్పించలేదన్న కారణంతో అక్కడి కోర్టులు ట్రాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించాయి.

దీంతో గుంటూరు కోర్టు నుంచి అరెస్టు వారెంటు తీసుకుని సునీల్ నాయక్ ను అదుపులోకి తీసుకోవాలని ఏపీ పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం బిహార్ లోనే ఉండిపోయారు. గురువారం గుంటూరు కోర్టు నుంచి అరెస్టు వారెంటు తీసుకోవాలని ప్రయత్నించారు. పోలీసుల పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు సునీల్ నాయక్ అరెస్టుకు వారెంట్ ఇష్యూ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై ఉత్తర్వులు విడుదల చేయకుండా సునీల్ నాయక్ తరఫు న్యాయవాదులు అడ్డుకున్నారు. మార్చి 2వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయొద్దన్న ఆదేశాలు ఉన్నాయని, ఒకకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పరిగణనలోకి తీసుకోకుండా వారెంటు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.

సునీల్ నాయక్ న్యాయవాదుల వాదనలతో గుంటూరు మొబైల్ కోర్టు న్యాయాధికారి డైలమాలో పడిపోయారు. అరెస్టు వారెంటు ఉత్తర్వుల జారీని నిలిపివేశారు. బిహార్ కోర్టు ఉత్తర్వులను పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు. దీంతో సునీల్ నాయక్ అరెస్టు ఎపిసోడ్ హైడ్రామాగా మారిందని అంటున్నారు. ఇరుపక్షాలు ఎత్తుకు పైఎత్తులతో వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇటు ఏపీ పోలీసులు, అటు బిహార్ పోలీసులు న్యాయస్థానాలను సమర్థంగా వాడుకుంటుండటం తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోందని అంటున్నారు.