Begin typing your search above and press return to search.

రేపిస్ట్ నాలుక కొరికిందని అత్యాచార బాధితురాలికి శిక్ష... కోర్టు తీర్పుపై 61 ఏళ్ల పోరాటం

దక్షిణ కొరియాలో ఆరంభమైన ఒక భయానక ఘటనకు 61 ఏళ్ల తర్వాత న్యాయం లభించడం చోయ్ మాల్ జా అనే మహిళా జీవితంలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది.

By:  Tupaki Desk   |   18 Sept 2025 1:00 AM IST
రేపిస్ట్ నాలుక కొరికిందని అత్యాచార బాధితురాలికి శిక్ష... కోర్టు తీర్పుపై 61 ఏళ్ల పోరాటం
X

దక్షిణ కొరియాలో ఆరంభమైన ఒక భయానక ఘటనకు 61 ఏళ్ల తర్వాత న్యాయం లభించడం చోయ్ మాల్ జా అనే మహిళా జీవితంలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది. 18 ఏళ్ల వయసులో ఉంటే ఆమెపై 21 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. తన ఆత్మరక్షణ కోసం చోయ్ మాల్ జా అతని నాలుకను కొరికింది. దీంతో నిందితుడి కంటే ఆమెకే ఎక్కువ శిక్ష విధించడం ఆ కాలంలో న్యాయవ్యవస్థలోని లింగ వివక్షను బహిర్గతం చేసింది.

అన్యాయ తీర్పు ... దాని ప్రభావం

ఆ ఘటన జరిగినప్పుడు కోర్టు విచారణలో నిందితుడికి కేవలం 6 నెలల జైలు శిక్ష పడగా, బాధితురాలి ఆత్మరక్షణను "దాడి"గా పరిగణించి ఆమెకు 10 నెలల జైలు శిక్ష విధించారు. మహిళ తనపై జరిగిన లైంగిక దాడి నుంచి తప్పించుకునేందుకు తీసుకున్న చర్యకు శిక్ష పడటం ఆ సమాజంలోని పితృస్వామ్య ధోరణులకు ఉదాహరణ. ఈ తీర్పు ఆమెను ఒకవైపు బాధితురాలిగా మార్చి, మరోవైపు నిందితురాలిగా ముద్ర వేసింది.

ఆరుదశాబ్దాల పోరాటం

చోయ్ మాల్ జా ఈ తీర్పు ముందు తలవంచలేదు. సంవత్సరాల తరబడి కోర్టు గడపలు తిరిగి న్యాయం కోసం పోరాడింది. క్రమంగా 2018లో మీటూ ఉద్యమం ఉధృతమైందంటే ఆమెకు మరొక ఆశాకిరణం కనిపించింది. ఆ ఉద్యమం స్ఫూర్తిగా మారి, కొత్త న్యాయవాదులను సంప్రదించి కేసు పునర్విచారణ కోసం ప్రయత్నాలు చేసింది. మొదట లోయర్ కోర్టులు తిరస్కరించినా, చివరికి సుప్రీంకోర్టు ఆమె పిటిషన్‌కు అనుకూలంగా స్పందించింది.

చారిత్రక తీర్పు

తాజాగా బుసాన్ జిల్లా కోర్టు ఈ కేసులో అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. చోయ్ మాల్ జా నాలుక కొరకడం అత్యాచారం నుంచి రక్షించుకోవడానికి తీసుకున్న ఆత్మరక్షణ చర్య అని స్పష్టంచేసి, ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్ కూడా కోర్టు విచారణ సమయంలో ఆమెకు క్షమాపణలు తెలిపింది. ఈ తీర్పు కేవలం చోయ్ మాల్ జాకే కాకుండా, భవిష్యత్తులో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు కూడా న్యాయం జరిగే మార్గాన్ని చూపుతుందని భావిస్తున్నారు.

బాధితురాలికి గౌరవప్రద గుర్తింపు

దశాబ్దాలపాటు బాధితురాలిగా ముద్రపడి, నిందలు అనుభవించిన చోయ్ మాల్ జా ఇప్పుడు చట్టపరంగా నిర్దోషిగా నిలిచింది. ఆమె తన స్పందనలో ఇకపై "బాధితురాలి" బిరుదును త్యజించి, "నిర్దోషి"గా గుర్తింపును పొందడం గర్వకారణమని తెలిపింది. అంతేకాక గతంలో తనపై జరిగిన అన్యాయం కారణంగా, పరిహారం కోసం ప్రభుత్వంపై దావా వేయాలని భావిస్తోంది.

చోయ్ మాల్ జా పోరాటం న్యాయవ్యవస్థలోని అన్యాయాత్మక తీర్పులను మాత్రమే బహిర్గతం చేయలేదు; లింగ వివక్షతో కూడిన పాత విధానాలను కూడా సవాల్ చేసింది. ఈ కేసు, లైంగిక హింస బారినపడిన ప్రతి మహిళా తన స్వీయ గౌరవం కోసం నిలబడే హక్కు ఉందనే వాస్తవానికి నిదర్శనంగా నిలిచింది.