Begin typing your search above and press return to search.

ఆడపడుచునే ‘సవతి’గా కోర్టును తప్పుదోవ.. విడాకుల కోసం నీచమైన పని చేసిన భార్య..!

మధ్యప్రదేశ్ హైకోర్టులో సంచలనంగా మారిన విడాకుల ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  Tupaki Political Desk   |   27 April 2026 3:05 PM IST
ఆడపడుచునే ‘సవతి’గా కోర్టును తప్పుదోవ.. విడాకుల కోసం నీచమైన పని చేసిన భార్య..!
X

సినిమా కథలను తలపించేలా సాగిన ఘటన చూస్తుంటే విడాకుల కోసం కొందరు ఎంతటి నీచానికైనా ఒడిగడతారని అర్థం అవుతోంది. సొంత ఆడపడుచునే భర్తకు రెండో భార్యగా చిత్రకరించి, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడం దారుణమైన చర్య. మధ్యప్రదేశ్ హైకోర్టులో సంచలనంగా మారిన విడాకుల ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విడాకుల ప్రక్రియలో సాధారణంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, గ్వాలియర్‌కు చెందిన ఒక మహిళ అనుసరించిన తీరు న్యాయ వ్యవస్థనే విస్మయానికి గురిచేసింది. తన భర్తకు విడాకులు ఇచ్చే ఉద్దేశం లేదని తెలిసి, అతడికి తెలియకుండానే విడాకులు పొందాలని ఆమె ఒక పకడ్బందీ వ్యూహం రచించింది. ఈ క్రమంలో రక్త సంబంధాన్ని కూడా వదలకుండా, భర్త సోదరితో దిగిన ఫొటోలను 'రెండో పెళ్లి'కి సాక్ష్యంగా చూపడం నైతిక విలువల పతనానికి అద్దం పడుతోంది.

అసలేం జరిగింది?

1998లో వివాహమైన దంపతుల మధ్య వృత్తిపరమైన కారణాలతో (మార్కెటింగ్ ఉద్యోగం వల్ల భర్త దూరంగా ఉండటం) గొడవలు మొదలయ్యాయి. 2015 నుంచి విడిగా ఉంటున్న ఈమె, చట్టబద్ధంగా విడాకులు కోరినా భర్త నిరాకరించాడు. 2021లో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసిన ఆమె, తన భర్తకు ఇదివరకే రెండో వివాహం జరిగిందని నమ్మబలికింది. అందుకు కోర్టు ఆధారాలను సమర్పించాలని కోరింది. దీంతో అతి తెలివిగా భర్త తన సోదరితో కలిసి దిగిన ఫోటోలను కోర్టుకు సమర్పించి సోదరిని రెండో భార్యగా చిత్రీకరించింది. ఫోటోలో ఉన్నది భర్త చెల్లి అని తెలియని ధర్మాసనం, ఆమె వాదనను నిజమని నమ్మి ఏకపక్షంగా విడాకులు మంజూరు చేసింది.

న్యాయపరమైన లోపాలు ఏకపక్ష తీర్పు..

ఈ కేసులో సదరు భర్త కోర్టు నాకు ఎలాంటి నోటీసులు పంపలేదని, నా వాదన వినిపించే అవకాశం కల్పించలేదని ఆరోపించారు. కేవలం ఫోటోలను చూసి, అది వివాహమా కాదా అని నిర్ధారించుకోకుండా తీర్పు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. భర్తకు నోటీసులు అందకుండా చిరునామాలు మార్చడం లేదా ఇతర మార్గాల ద్వారా ఆమె కోర్టును మేనేజ్ చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏప్రిల్, 2026లో విడాకుల డిక్రీ చేతికి వచ్చే వరకు భర్తకు ఈ విషయమే తెలియకపోవడం గమనార్హం.

హైకోర్టులో పోరాటం..

తన సొంత చెల్లినే రెండో భార్యగా చూపించి విడాకులు పొందడంపై సదరు వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య తప్పుడు వివరాలు, ఫోటోలతో కోర్టును మోసం చేసిందని, ఆ విడాకుల తీర్పును రద్దు చేయాలని ఆయన కోరాడు. న్యాయస్థానంలో తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం నేరం. ఒకవేళ ఆమె మోసం నిరూపితమైతే, విడాకులు రద్దు అవ్వడమే కాకుండా, ఆమె జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సామాజిక, నైతిక కోణం

ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరిక వంటిది. విడాకులు పొందాలనే ఆత్రుతలో బంధాలను, మనుషుల గౌరవాన్ని పణంగా పెట్టడం సరికాదు. తనను వదినే ఇలా సమాజం ముందు ‘రెండో భార్య’గా చిత్రకరించడం ఆ సోదరి మానసిక స్థితి, ఆమె సామాజిక గౌరవాన్ని ఎంతగా దెబ్బతీస్తుందో ఊహించవచ్చు. ఇలాంటి ఘటనల వల్ల నిజంగా ఇబ్బందులు పడుతున్న మహిళలకు న్యాయం జరగడంలో ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. న్యాయమూర్తులు సాక్ష్యాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోంది.

గ్వాలియర్ మహిళ చేసిన ఈ పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైకోర్టు ఈ కేసును విచారిస్తున్న తరుణంలో, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మోసంతో పొందిన విజయం ఎంతో కాలం నిలవదు. విడాకులు కావాలంటే చట్టబద్ధమైన మార్గాల్లో పోరాడాలే తప్ప, ఇలాంటి వికృత చేష్టలకు దిగడం వల్ల జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ కేసులో హైకోర్టు తీర్పు ఇలాంటి తప్పుడు సాక్ష్యాలు చెప్పే వారికి ఒక గుణపాఠం కావాలి.