Begin typing your search above and press return to search.

7 రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోతే.. శిల్పా శెట్టి షోకు వార్నింగ్!

ప్ర‌ఖ్యాత సోనీ పిక్చ‌ర్స్ నెట్ వ‌ర్క్స్ తో శిల్పాశెట్టి అనుబంధం సుదీర్ఘకాలంగా కొన‌సాగుతోంది

By:  Tupaki Desk   |   27 July 2023 4:24 AM GMT
7 రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోతే.. శిల్పా శెట్టి షోకు వార్నింగ్!
X

సాగ‌ర‌క‌న్య శిల్ప‌శెట్టి డ్యాన్స్ రియాలిటీ షోల జ‌డ్జిగా .. టాప్ మోడ‌ల్ గా ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమాల‌కు దూర‌మ‌య్యాక బుల్లితెర నుంచి ఆశించిన ఆదాయాన్ని శిల్పాజీ ఆర్జిస్తున్నారు. అయితే ఇంత‌కుముందు భ‌ర్త రాజ్ కుంద్రా వివాదాల్లో చిక్కుకోవ‌డం త‌న‌కు కెరీర్ ప‌రంగా కొంత ఇబ్బందిని క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకుంటూనే బుల్లితెర‌ కెరీర్ ప‌రంగా ఎలాంటి డోఖా లేకుండా శిల్పాశెట్టి ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతోంది.

ప్ర‌ఖ్యాత సోనీ పిక్చ‌ర్స్ నెట్ వ‌ర్క్స్ తో శిల్పాశెట్టి అనుబంధం సుదీర్ఘకాలంగా కొన‌సాగుతోంది. అయితే ఇప్పుడు సోనీ పిక్చర్స్ సంస్థ‌లు 'అనుచితమైన కంటెంట్' ను ప్రసారం చేశాయని ఆరోపిస్తూ నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) మంగళవారం నోటీసు జారీ చేయడంతో సోని TV సూపర్ డ్యాన్సర్ షో న్యాయపరమైన చిక్కుల్లో పడింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక‌ వీడియోలో రియాలిటీ జ‌డ్జిలు ఒక‌ మైనర్ పిల్లవాడిని త‌ల్లిదండ్రుల గురించి ప్ర‌శ్నిస్తూ అనుచితమైన లైంగికత‌కు సంబంధించిన‌ అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ని అన్ని చోట్ల నుంచి తొలగించాలని కమిషన్‌ డిమాండ్‌ చేసింది. దీనిపై వివరణ కూడా కోరింది. పిల్లవాడిని అడిగిన ప్రశ్నలన్నీ తగనివి కాదు.. కలవరపరిచేవిగా ఉన్నాయి. ఇవి పిల్లలను అడగాల్సినవి కావు ! అని క‌మీష‌న్ నివేదిక పేర్కొంది.

పై విషయాలను దృష్టిలో ఉంచుకుని CPCR చట్టం, 2005 U/s 13 (1) (j)ని పరిగణలోకి తీసుకోవడం సముచితమని కమిషన్ భావించింది. మీ ఛానెల్ జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం 2015 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినట్లు గమనించిన‌ట్టు క‌మిష‌న్ పేర్కొంది. అంతేకాకుండా సోనీ చానెల్ కంటెంట్ కమిషన్ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. వినోద పరిశ్రమలో ఏదైనా వాణిజ్య వినోద కార్యకలాపంలో బాలలు కౌమార ద‌శ‌లో ఉన్న పిల్ల‌ల‌కు సంబంధించిన మార్గదర్శకాలు విధిగా పాటించాల‌ని కమిషన్ పేర్కొంది.

మైనర్ చైల్డ్ ఆర్టిస్ట్‌ను ఇలాంటి అనుచిత ప్రశ్నలు ఎందుకు అడిగారో వివరణ ఇవ్వాలని కూడా కమిషన్ కోరింది. ఆ ఎపిసోడ్‌ను అత్యవసరంగా చానెల్/ యూట్యూబ్ నుంచి తొల‌గించాల్సిందిగా క‌మిష‌న్ కోరింది. ఇక‌పై మీ ఛానెల్‌లో అలాంటి అనుచితమైన కంటెంట్‌ను ప్రసారం చేయవద్దని కూడా అభ్యర్థించబడింది. లేఖ అందిన 7 రోజుల్లోగా కమిషన్‌కు యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్) సమర్పించాలని ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్ తన లేఖలో పేర్కొన్నారు.