Begin typing your search above and press return to search.

సిబిల్ స్కోర్ లేదని ఉద్యోగం ఇవ్వని ఎస్.బీఐ.. సమర్థించిన హైకోర్టు

ఒకప్పుడు సిబిల్ స్కోర్ అనగానే మనకు వెంటనే రుణాలు, క్రెడిట్ కార్డుల లావాదేవీలు, బ్యాంకు రికార్డులు గుర్తుకు వచ్చేవి.

By:  Tupaki Desk   |   27 Jun 2025 4:01 PM IST
సిబిల్ స్కోర్ లేదని ఉద్యోగం ఇవ్వని ఎస్.బీఐ.. సమర్థించిన హైకోర్టు
X

ఒకప్పుడు సిబిల్ స్కోర్ అనగానే మనకు వెంటనే రుణాలు, క్రెడిట్ కార్డుల లావాదేవీలు, బ్యాంకు రికార్డులు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఈ స్కోర్ కేవలం ఆర్థిక విషయాలకు పరిమితం కాకుండా.. ఉద్యోగ నియామకాలపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరింది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకున్న ఒక నిర్ణయం ఈ విషయాన్ని స్పష్టంగా చాటింది.

- అన్ని పరీక్షల్లో పాసైనా... ఉద్యోగం రద్దు

తమిళనాడుకు చెందిన ఓ అభ్యర్థి SBIలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుకు దరఖాస్తు చేశారు. ఆయన రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ వంటి నియామక ప్రక్రియలో అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసి.. 2021 మార్చి 16న నియామక పత్రం కూడా అందుకున్నారు. కానీ చివర్లో జరిగిన సిబిల్ రిపోర్ట్ పరిశీలనలో పలు ప్రతికూల అంశాలు వెలుగు చూశాయి.

-పాత రుణాలపై చెల్లింపుల లోపం, అధిక ఎంక్వైరీలు

అభ్యర్థి గతంలో తీసుకున్న వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు సకాలంలో చెల్లించకపోవడం, కొన్ని రుణాలు రైట్-ఆఫ్ చేయబడటం, న్యాయపరమైన చర్యలు మొదలవడం వంటి అంశాలు అతని క్రెడిట్ రిపోర్టులో ఉన్నాయి. అంతేకాదు గత ఐదేళ్లలో 50కి పైగా రుణ ఎంక్వైరీలు కూడా నమోదు అయ్యాయి. దీంతో ఎస్బీఐ అతని నియామకాన్ని రద్దు చేసింది.

-కోర్టులో పోరాటం.. కానీ ఫలితం కలిసిరాలేదు

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అభ్యర్థి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన రుణ బాకీలన్నీ తాను పూర్తిగా చెల్లించానని వాదించారు. కానీ ఎస్బీఐ తరఫున న్యాయవాదులు, నియామక నోటిఫికేషన్‌లో క్లాజ్ 1(E) ప్రకారం, ప్రతికూల క్రెడిట్ హిస్టరీ కలిగి ఉన్న అభ్యర్థులను ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించవచ్చని న్యాయస్థానానికి వివరించారు. బ్యాంకు ఉద్యోగులు ప్రజల డబ్బుతో వ్యవహరించే బాధ్యత కలిగి ఉండే వ్యక్తులు కావడంతో వారి ఆర్థిక వ్యవహారాల్లోనూ నిష్ట ఉండాలని పేర్కొన్నారు.

-హైకోర్టు తీర్పు.. ఎస్బీఐకి మద్దతు

వాదనలు పరిశీలించిన మద్రాస్ హైకోర్టు, ఎస్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అభ్యర్థికి ఉన్న క్రెడిట్ హిస్టరీ చూస్తే, అతనికి పబ్లిక్ డబ్బు నిర్వహించేందుకు అవసరమైన ఆర్థిక క్రమశిక్షణ లేదని స్పష్టం చేసింది. అందువల్ల ఎస్బీఐ నియామకాన్ని రద్దు చేయడం సరైనదేనని తీర్పు ఇచ్చింది.

-ఇకపై ఉద్యోగాలకు కూడా క్రెడిట్ స్కోర్ ముఖ్యం!

ఈ ఘటన అనంతరం స్పష్టమవుతోంది ఇప్పటివరకు కేవలం రుణాల కోసం అనుకున్న సిబిల్ స్కోర్, ఉద్యోగ నియామకాలపై కూడా ప్రభావం చూపించబోతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో ఉద్యోగాలు ఆశిస్తున్న వారు తమ క్రెడిట్ హిస్టరీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రుణాలు సకాలంలో చెల్లించాలి, అవసరమైన పరిమితిలోనే క్రెడిట్ వాడాలి. లేదంటే, సిబిల్ స్కోర్ బాగా పడిపోతుంది. అది ఉద్యోగ అవకాశాలను కూడా దూరం చేయగలదు.