Begin typing your search above and press return to search.

అమ్మ కోసం అన్నదమ్ముల యుద్ధం.. కోర్టుకెక్కిన కుమారులు.. అరుదైన సెంటిమెంట్!

కానీ ‘తల్లి నా వద్దే ఉండాలి’ అని ఇద్దరు కొడుకులు ఏకంగా కోర్టు వరకు వెళ్లడం వింటుంటే.. మానవ సంబంధాల్లో ఇంకా విలువలు మిగిలే ఉన్నాయని అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   25 April 2026 5:00 PM IST
అమ్మ కోసం అన్నదమ్ముల యుద్ధం.. కోర్టుకెక్కిన కుమారులు.. అరుదైన సెంటిమెంట్!
X

ఈ రోజుల్లో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేసే వార్తలే ఎక్కువగా వింటుంటాం. కానీ ‘తల్లి నా వద్దే ఉండాలి’ అని ఇద్దరు కొడుకులు ఏకంగా కోర్టు వరకు వెళ్లడం వింటుంటే.. మానవ సంబంధాల్లో ఇంకా విలువలు మిగిలే ఉన్నాయని అనిపిస్తోంది. సౌదీ అరేబియాలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది.

ప్రస్తుత సమాజంలో ఆస్తి పాస్తుల కోసం అన్నదమ్ములు కోర్టుల చుట్టూ తిరగడం సర్వసాధారణం. కానీ సౌదీ అరేబియాలో జరిగిన ఒక కేసు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వృద్ధురాలైన తల్లిని తానే సాకాలని, లేదు తన వద్దే ఆమె ఉండాలని ఇద్దరు కొడుకులు న్యాయపోరాటానికి దిగారు. తల్లి బాధ్యత కేవలం భారం కాదు, 'గౌరవం' అని భావించిన ఆ అన్నదమ్ముల వాదనలు విని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోయారు. ఈ కేసు కేవలం చట్టపరమైన తీర్పునకు సంబంధించింది కాదు.. ఇది ఒక మాతృప్రేమకు పట్టాభిషేకం.

హేలా, ఆమె ఇద్దరు కుమారులు

వయసు పైబడిన హేలా అనే తల్లికి ఇద్దరు కుమారులు. ఆమె చాలా సంవత్సరాల నుంచి తన పెద్ద కుమారుడైన హిజాబ్‌ వద్దే ఉంటోంది. అయితే, ఆమెకు వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం క్షీణించడంతో, చిన్న కుమారుడు రంగంలోకి దిగాడు. ‘ఇన్నాళ్లూ అమ్మ నా వద్దే ఉంది, నా చేతులతోనే ఆమెకు సేవ చేశాను. ఇప్పుడు కూడా ఆమెను నేనే చూసుకుంటాను’ అని అతను అన్నను అడిగాడు. కానీ అన్న నో చెప్పాడు. దీంతో తమ్ముడు కోర్టును ఆశ్రయించాడు.

చిన్న కొడుకు వాదన: ‘అన్నయ్యకు కూడా వయసు పైబడింది, ఆయన ఆరోగ్యం కూడా అంత బాగుండదు. నా ఆర్థిక స్థితి బాగుంది, నేను అమ్మకు మెరుగైన వైద్యం, సౌకర్యాలు కల్పించగలను. కాబట్టి ఆమెను నా వద్దకు పంపండి’ అని కోర్టును వేడుకున్నాడు.

న్యాయస్థానం నిర్ణయం..

ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తల్లి ఎవరి వద్ద ఉంటే సురక్షితంగా, సుఖంగా ఉంటుందో అన్న కోణంలో కోర్టు ఆలోచించింది. చిన్న కుమారుడు పెద్దవాడి కంటే యవ్వనంలో ఉన్నాడు, శారీరక దృఢత్వం కలిగి ఉన్నాడు. అలాగే అతని ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉండడం వల్ల తల్లికి అవసరమైన వైద్య ఖర్చులను అతను సులభంగా భరించగలడని కోర్టు భావించింది. చాలా కాలం పాటు పెద్ద కొడుకు తల్లికి సేవ చేశాడని గుర్తిస్తూనే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తల్లిని చిన్న కొడుకు వద్దకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది.

విలపించిన పెద్ద కొడుకు..

సాధారణంగా కోర్టులో కేసు ఓడిపోతే ఆస్తి పోయిందని బాధపడతారు. కానీ ఈ కేసులో పెద్ద కొడుకు హిజాబ్, తల్లిని తన వద్ద ఉంచుకునే ‘హక్కు’ను కోల్పోయినందుకు కోర్టులోనే బోరున విలపించాడు. తన చేతుల నుంచి పుణ్యం చేజారిపోయిందని ఆవేదన చెందడం చూసి అక్కడి వారు చలించిపోయారు. తల్లిని చూసుకునే అవకాశం రావడం అనేది దైవం ఇచ్చిన వరంగా ఆయన భావించడమే దీనికి కారణం.

నేటి తరానికి పాఠం!

ఈ సౌదీ ఉదంతం నేటి సమాజానికి ఒక పెద్ద గుణపాఠం. తల్లిదండ్రులను పోషించడం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక అదృష్టం అని ఈ ఘటన నిరూపించింది. ఆస్తుల కోసం కాకుండా, అమ్మ సేవ కోసం అన్నదమ్ములు పోటీ పడడం సభ్య సమాజానికి ఆదర్శం.

సౌదీ అరేబియా కోర్టు ఇచ్చిన తీర్పు చట్టపరంగా చిన్న కొడుకుకు అనుకూలంగా ఉన్నా, పెద్ద కొడుకు చూపిన ఆరాటం మాతృప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పింది. ఈ అన్నదమ్ముల గొడవలో ఓడిపోయిన వారు లేరు.. అలాగని గెలిచిన వారు లేరు.. ఇద్దరి మనసుల్లో ఉన్నది స్వచ్ఛమైన ప్రేమే. ఆ తల్లి ఎంతటి అదృష్టవంతురాలు అని ప్రపంచమంతా ఈ వార్త చూసి ముక్కున వేలేసుకుంటోంది. మన సమాజంలో కూడా ఇలాంటి ‘పోటీ’ ఉంటే వృద్ధాశ్రమాలకు చోటే ఉండదు.