Begin typing your search above and press return to search.

"రాజధాని ఫైల్స్" సినిమాకు షాక్... హైకోర్టు కీలక ఆదేశాలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ సినిమాల సందడి నెలకొంటున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Feb 2024 7:20 AM GMT
రాజధాని ఫైల్స్ సినిమాకు షాక్... హైకోర్టు కీలక ఆదేశాలు!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ సినిమాల సందడి నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే "యాత్ర - 2" విడుదలై సంచలనం సృష్టించగా.. ఆర్జీవీ "వ్యూహం" ఈ నెల 23న విడుదలకు సిద్ధంగా ఉంది! ఈ గ్యాప్ లో "రాజధాని ఫైల్స్" హాట్ టాపిక్ గా మారింది. దీంతో... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారని.. అందువల్ల ఈ సినిమా ప్రదర్శనను నిలుపుదల చేయాలని కోరుతూ వైసీపీ న్యాయ పోరాటం ప్రారంభించింది. ఈ సమయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.

అవును... "రాజధాని ఫైల్స్" సినిమాను పూర్తిగా ఏపీ సీఎం జగన్‌, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు తీశారని, ఈ సమయంలో సెన్సార్‌ బోర్టు జారీ చేసిన ధ్రువ పత్రాన్ని రద్దు చేయాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వైసీపీని చులకన చేయాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని ఆరోపించారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా స్పందిస్తూ... "రాజధాని ఫైల్స్" సినిమాకు షాకిచ్చింది.

ఇందులో భాగంగా... ఇవాళ (ఫిబ్రవరి 15)న విడుదల కావాల్సిన ఈ రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను రేపటి వరకూ నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో... ఆ సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను తమకు అందించాలని స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమా విడుదలపై తీవ్ర ఆసక్తి నెలకొంది!

కాగా మంగళవారం ఈ పిటిషన్ పై హైకోర్టులో జరిగిన వ్యాజ్యంలో వైసీపీ తరుపున న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ... రాజధాని ఫైల్స్‌ పేరుతో తీసిన సినిమా ఏకైక లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే అని అన్నారు. అసత్యాలతో, సత్యదూరమైన విషయాలతో ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక ప్రజల్లో వైసీపీని పలుచన చేయాలన్న ఉద్దేశం కూడా ఉందని అన్నారు.

మరోపక్క చిత్ర నిర్మాతల తరఫున న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. మొదట తమ సినిమాని ఎగ్జామిన్‌ కమిటీ చూసిందని.. అనంతరం పలు సన్నివేశాలను తొలగించాలని చెప్పిందని.. అయితే ఈ విషయంపై తాము రివిజన్‌ కమిటీని ఆశ్రయించామని తెలిపారు. అయితే... రివిజన్‌ కమిటీ కూడా పలు సన్నివేశాలను తొలగించాలని చెప్పడంతో ఆ సన్నివేశాలను తొలగించామని అన్నారు. తమకు గత ఏడాది డిసెంబర్‌ లో సర్టిఫికెట్‌ ఇస్తే వైసీపీ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించిందని అన్నారు.