Begin typing your search above and press return to search.

ఆ విషయాలను పార్లమెంట్ లో మాట్లాడాలి.. రాహుల్ కు సుప్రీం హితబోధ..

‘భారత్ జోడో’ యాత్ర రాహుల్ కు కలిసి వచ్చింది ఏంటో కానీ.. నష్టమైతే ఎక్కువగానే తీసుకచ్చిందని పరిస్థితులను చూస్తే అర్థం అవుతోంది.

By:  Tupaki Desk   |   4 Aug 2025 3:57 PM IST
ఆ విషయాలను పార్లమెంట్ లో మాట్లాడాలి.. రాహుల్ కు సుప్రీం హితబోధ..
X

‘భారత్ జోడో’ యాత్ర రాహుల్ కు కలిసి వచ్చింది ఏంటో కానీ.. నష్టమైతే ఎక్కువగానే తీసుకచ్చిందని పరిస్థితులను చూస్తే అర్థం అవుతోంది. 2022లో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు రాహుల్ గాంధీ. యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన ప్రసంగాలపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ఆయన విచారణ ఎదుర్కొంటూనే ఉన్నారు. రెండు దఫాలుగా ప్రభుత్వానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మూడో సారి అధికారమే లక్ష్యంగా రాహుల్ భారత్ జోడో యాత్రకు పూనుకున్నారు. దేశం మొత్తం పాదయాత్ర చేపట్టారు. చాలా రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. స్థానిక నాయకులతో మాట్లాడారు. సోషల్ మీడియాను కూడా వాడుకున్న ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై కేసులు నమోదయ్యాయి.

కేసులతో రాహుల్ సహవాసం..

కేసులకు సంబంధించి బెయిల్స్, ప్రొసీజర్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత పదిహేను రోజుల వ్యవధిలో ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టులో ఇలాంటి కేసుకు సంబంధించి బెయిల్ మంజూరైంది. ఈ విషయంకు సంబంధించి అమిత్ మాళవీయ పోస్ట్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయం పక్కన పెడితే.. చైనా భారత్ భూ భాగం ఆక్రమించిందన్న రాహుల్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. పైగా ‘మీకెలా తెలుసు?’ అంటూ సూటిగా ప్రశ్నించింది.

మీకు చైనా నేరుగా చెప్పిందా.. సుప్రీం

భారత్ జోడో యాత్రలో భాగంగా 2022లో రాహుల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ కు చెందిన 2వేల కిలోమీటర్ల మేర భూభాగం చైనా ఆక్రమించుకుందని, అయినా ప్రభుత్వం ఏమీ చేయడం లేదని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ భూభాగం దేశ రాజధాని ఢిల్లీ భూ భాగం కంటే ఎక్కువని అన్నారు. ‘అరుణాచల్ ప్రదేశ్ లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.’ భూ భాగం తిరిగి ఇవ్వాలని సైన్యం చైనాతో చర్చలు జరుపుతుంటే.. మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటని?’ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, ఏజీ మాసిహ్ లతో కూడిన బెంచ్ రాహుల్ వ్యాఖ్యలను తప్పపట్టింది. ‘చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందన్న విషయం మీకు ఎలా తెలిసింది..?’ అని ప్రశ్నించింది. దేశభక్తి కలిగిన భారత పౌరులు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని తప్పుపట్టింది. ఈ కేసులో రాహుల్ తరఫు న్యాయవాది బెంచ్ కు విన్నవిస్తూ.. ‘ప్రశ్నించకపోతే ప్రతిపక్ష నేత ఎలా అవుతాడు’ అని పేర్కొన్నారు. దానికి బదులుగా ప్రశ్నించడం సోషల్ మీడియాలో కాదని.. పార్లమెంట్ లో జరగాలని సూచించింది. సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సాధారణ పౌరులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. బాధ్యత ఉన్న ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే దేశ పౌరుల మన్ననను చూరుగొనరని కోర్టు సూచించింది.