Begin typing your search above and press return to search.

రూ. 4 చోరీ కేసులో 50 ఏళ్ల తర్వాత తీర్పు.. న్యాయ వ్యవస్థపై సర్వత్రా చర్చ..

న్యాయం ఆలస్యం అయితే ‘అది న్యాయమే కాదు’ అనే మాట తరచూ వినిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అదే ఆలస్యం, ఒక మనిషి జీవితంపై పడే భారాన్ని ఎంత లోతుగా చూపిస్తుందో కూడా చెప్పకనే చెబుతుంది.

By:  Tupaki Desk   |   6 Jan 2026 11:05 AM IST
రూ. 4 చోరీ కేసులో 50 ఏళ్ల తర్వాత తీర్పు.. న్యాయ వ్యవస్థపై సర్వత్రా చర్చ..
X

న్యాయం ఆలస్యం అయితే ‘అది న్యాయమే కాదు’ అనే మాట తరచూ వినిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అదే ఆలస్యం, ఒక మనిషి జీవితంపై పడే భారాన్ని ఎంత లోతుగా చూపిస్తుందో కూడా చెప్పకనే చెబుతుంది. గడియారం, చేతి రుమాలు, కేవలం 4 రూపాయల దొంగతనం కేసులో 51 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన ఘటన మహారాష్ట్ర న్యాయవ్యవస్థలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కేసు తీరిది..

1974లో పూణేలోని బండ్‌ గార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోరీ కేసు నమోదైంది. గులాబ్‌ సాహు జాదవ్‌, ముకుంద కెర్బా వాగ్మారే, రాజారాం తుకారాం కాలే అనే ముగ్గురిపై పోలీసులు కేసు పెట్టారు. ఆరోపణల ప్రకారం ఒక గడియారం, చేతి రుమాలు, అలాగే రూ.4 నగదు దొంగతనం జరిగిందని పేర్కొన్నారు. ఆ కాలంలో చిన్న కేసులైనా కఠినంగా విచారించేవారు. అందులో భాగంగానే విచారణ కొనసాగింది. ఈ కేసులో గులాబ్‌ సాహు జాదవ్‌, ముకుంద కెర్బా వాగ్మారే నేరాన్ని అంగీకరించడంతో 1975, ఏప్రిల్‌ 10న వారిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. అయితే మూడో నిందితుడు రాజారాం కాలే మాత్రం అప్పటి నుంచి పరారీలో ఉన్నట్లు నమోదైంది. కేసు ఫైళ్లలో ఆయన పేరు మిగిలిపోయింది. ఏళ్ల తరబడి ఆయనపై అరెస్ట్‌ వారెంట్లు కొనసాగాయి.

కేసు నుంచి తొలిగిపోని పేరు..

కాలం గడిచింది. దశాబ్దాలు మారాయి. పోలీసు రికార్డులు, కోర్టు ఫైళ్లు పాతబడ్డాయి. అయినా రాజారాం కాలే పేరు మాత్రం కేసు నుంచి తొలగలేదు. దాదాపు 51 సంవత్సరాల పాటు ఆయన పరారీగానే పరిగణించబడ్డాడు. కానీ ఈ కాలంలో అతనిపై ఉన్న ఆరోపణలను నిరూపించే స్పష్టమైన ఆధారాలు మాత్రం లభించలేదు. ఈ నేపథ్యంలో 2025, డిసెంబరు 26న పుణె కోర్టులో కీలక తీర్పు వెలువడింది. జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎన్‌జే చవన్ కేసును పరిశీలించి, రాజారాం కాలేపై ఉన్న అన్ని అరెస్ట్‌ వారెంట్లను రద్దు చేశారు. సరైన ఆధారాలు లేకుండా అర్ధ శతాబ్దం పాటు కేసును కొనసాగించడం సబబు కాదని కోర్టు అభిప్రాయపడింది. చివరికి రాజారాం కాలేను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మనిషి జీవితం అంత విలువలేనిదా?

కేవలం 4 రూపాయల దొంగతనం ఆరోపణ.. కానీ దాని నీడలో ఒక మనిషి జీవితం అర్ధ శతాబ్దం పాటు సాగింది. ఈ తీర్పు ఒక వ్యక్తికి న్యాయం చేసినట్టే కాదు, న్యాయవ్యవస్థలో ఆలస్యం వల్ల కలిగే ప్రభావాలపై కూడా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. చిన్న కేసులైనా ఆధారాలు లేకపోతే ఎంతకాలం లాగవచ్చన్న సందేహాన్ని ఈ ఘటన మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ కేసు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది. నేరం చిన్నదైనా, న్యాయం ఆలస్యం అయినా, చివరికి సత్యం బయటపడాల్సిందే. అయితే ఆ సత్యం బయటపడేలోపు గడిచిపోయిన కాలానికి బాధ్యత ఎవరిది అన్న ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది.

విస్తృత చర్చ..

ఈ తీర్పు వెలువడిన తర్వాత న్యాయవ్యవస్థ పనితీరుపై విస్తృత చర్చ మొదలైంది. చిన్న కేసులైనా సరే, వాటిని సమయానికి తేల్చకపోతే అవి ఒక వ్యక్తి జీవితంపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. నేరం నిరూపించకుండానే ఏళ్ల తరబడి కేసు వేలాడుతుండడం వల్ల మానసిక ఒత్తిడి, సామాజిక ముద్ర, భవిష్యత్తుపై అనిశ్చితి వంటి సమస్యలు తప్పవు. ఈ కోణంలో చూస్తే, రాజారాం కాలే నిర్దోషిగా విడుదల కావడం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, వ్యవస్థలోని లోపాలను గుర్తు చేసే సంఘటనగా నిలిచింది.

భిన్నాభిప్రాయాలు..

అదే సమయంలో, ఈ కేసు పోలీసు దర్యాప్తు, ఆధారాల సేకరణ, కోర్టు ప్రక్రియల వేగంపై కూడా ప్రశ్నలు వేస్తోంది. నేరానికి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాలు లేకపోయినా దశాబ్దాల పాటు కేసును కొనసాగించడం ఎంతవరకు సమంజసం అన్న అంశంపై ఆలోచన అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. న్యాయం ఆలస్యం అయినా చివరికి రాజారాం కాలేకు అనుకూలంగా తీర్పు రావడం ఊరట కలిగించినా, ఇలాంటి కేసులు మళ్లీ పునరావృతం కాకుండా వ్యవస్థలో మార్పులు అవసరమన్న సందేశాన్ని ఈ తీర్పు బలంగా ఇచ్చింది.