నోటికి పని చెప్పిన ప్రసన్న రెడ్డికి నోముందస్తు బెయిల్.. తేల్చిన హైకోర్టు
ఈ మధ్యన ఏపీకి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థిపై చేసిన వ్యాఖ్యల వీడియోను చూసినోళ్లంతా.. మరీ ఇంత దారుణంగా మాట్లాడటమా? అన్న పరిస్థితి.
By: Tupaki Desk | 17 July 2025 10:15 AM ISTఎంత రాజకీయం అయితే మాత్రం వెనుకా ముందు చూసుకోకుండా.. ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఏ మాత్రం సరికాదు. ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు మరచిపోతున్నారు. ఈ మధ్యన ఏపీకి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థిపై చేసిన వ్యాఖ్యల వీడియోను చూసినోళ్లంతా.. మరీ ఇంత దారుణంగా మాట్లాడటమా? అన్న పరిస్థితి.
ఒక మహిళా నేతను పట్టుకొని ఇంత చౌకబారుతనంగా మాట్లాడిన ఉదంతమే లేదన్న మాట పలువురి నోట వినిపించింది మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి అందరి ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డి తీరుపై విస్మయం వ్యక్తమైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి వేళ.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న ఆలోచనతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ప్రసన్నకుమార్ రెడ్డి.
పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్ల లోపు జైలుశిక్షకు వీలున్నవేనని.. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రసన్నకుమార్ రెడ్డి తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది.. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆదేశాలతోనే ఆమె అనుచరులు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారని.. పోలీసులు నమోదు చేసిన కేసులోని సెక్షన్లు ఏడేళ్ల లోపు జైలుశిక్షకు వీలున్నవే కావటంతో బెయిల్ ఇవ్వాలని కోరారు.
పోలీసుల తరఫు వాదనలు వినిపించిన పీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని లక్ష్యంగా చేసుకొని.. ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైనాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యల్ని సమర్థించుకునేలా తర్వాతి రోజు కూడా వీడియో విడుదల చేసిన వైనాన్ని గుర్తు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాల్ని.. ప్రతిష్ఠను దెబ్బ తీసేలా మాట్లాడటానికి వీల్లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రసన్నకుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో.. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందన్న మాట వినిపిస్తోంది.
