Begin typing your search above and press return to search.

కోర్టుకు సమర్పించిన ప్రభాకర్ రావు అఫిడవిట్ లో ఏముంది?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు దాఖలు చేసిన అఫిడవిట్ సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   9 May 2024 4:46 AM GMT
కోర్టుకు సమర్పించిన ప్రభాకర్ రావు అఫిడవిట్ లో ఏముంది?
X

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు దాఖలు చేసిన అఫిడవిట్ సంచలనంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన చక్రం తిప్పారని.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఆయన కనుసన్నల్లో జరిగిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున రావటం తెలిసిందే. ఎన్నికల్లో కేసీఆర్ సర్కారు ఓటమి అనంతరం వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ప్రభాకర్ రావు పాత్ర మీద బోలెడు సమాచారం తెర మీదకు రావటం తెలిసిందే. కొద్దికాలంగా విదేశాల్లో ఉంటున్న ఆయన్ను అరెస్టు చేసి.. విచారిస్తే చాలా విషయాల మీద క్లారిటీ వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇలాంటివేళ ఆయన నాంపల్లి కోర్టులో తన అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా సంచలన అంశాల్ని వెల్లడించారు. తాను సైతం కేసీఆర్ బాధితుడినంటూ.. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఆయన పేర్కొన్న విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ ఒత్తిళ్లతో నల్గొండ ఎస్పీ పోస్టు నుంచి తనను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచితంగా బదిలీ చేశారని.. అప్పట్లో తాను ప్రతిపక్ష నేతలకు మద్దతు ఇస్తున్నానని టీఆర్ఎస్ జిల్లా నేతలు చెప్పటంతో ముఖ్యమంత్రి ఆ నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు.

తనను సీఐడీకిబదిలీ చేశారని.. డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి కల్పించటంలోనూ ఐదు నెలలు ఆలస్యం చేశారన్నారు. తాను కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినవాడిని కావటం వల్లే తనను ప్రభుత్వం నిఘా విభాగంలోకి తీసుకుందన్న దాంట్లో నిజం లేదన్నారు. ఎస్ ఐబీలో పదేళ్లు ఎస్పీగా పని చేసిన అనుభవం ఉండటంతో అప్పటి డీజీపీ సిఫార్సుతోనే తనను తీసుకున్నారని.. తాను ఎస్ఐబీ చీఫ్ గా ఉన్నప్పుడు అప్పటి డీజీపీ.. ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలోనే చేసినట్లుగా వెల్లడించారు.

తాను స్వతంత్రంగా పని చేసే అధికారం ఉండదన్న ఆయన.. 30 ఏళ్ల సర్వీసులో తాను ప్రదర్శించిన ప్రతిభకు నిదర్శనంగా పలు పతకాలు లభించాయన్నారు. తాను హైదరాబాద్ లో పర్మినెంట్ నివాసం ఉందన్న ఆయన ప్రస్తుతానికి అమెరికాలోని ఇల్లినోయి పాంటియాక్ లో ఉన్నట్లుగా వెల్లడించారు. నాలుకపై ట్యూమర్ కు చికిత్స పూర్తి అయ్యాక తప్పనిసరిగా విచారణ అధికారుల ముందు హాజరవుతానని పేర్కొన్న ఆయన.. దర్యాప్తు సంస్థ కోరుతున్న అరెస్టు వారెంట్ దరఖాస్తును కొట్టేయాలని కోరారు. తాను జీవితాన్ని పణంగా పెట్టి తీవ్రవాద.. ఉగ్రవాద కార్యకలాపాల అణిచివేత కోసం పని చేశానని.. వారికి టార్గెట్ గా మారినట్లుగా వెల్లడించారు.

నాలుకపై ట్యూమర్కారణంగా 2004-10 మధ్య కాలంలో పలు సర్జరీలు చేయించుకున్నట్లుగా వెల్లడించిన ప్రభాకర్ రావు.. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్యుల్నిసూచనల్ని తీసుకుంటున్నట్లు చెప్పారు. కొవిడ్ బారిన పడిన తర్వాత 2023 మార్చిలో గొంతు.. ఊపిరితిత్తుల్లో సమస్యలు వచ్చాయని.. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత అమెరికాకువెల్లి పూర్తి స్థాయి పరీక్షలు చేయించి వైద్యం పొందుతున్నట్లుగా పేర్కొన్నారు. అమెరికా పౌరసత్వం ఉన్న తన బంధువైన విజయ్ ద్వారా అమెరికాలోని వైద్యుల్ని కలిశానని.. ప్రస్తుతం ఆహారం తీసుకోవటంలోనూ సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారు.

తాను తన భార్యతో కలిసి అమెరికాకు వెళ్లేందుకు గత ఫిబ్రవరి 15న టికెట్లు బుక్ చేసుకున్నట్లు చెప్పిన ప్రభాకర్ రావు.. జూన్ 26న తిరిగి వచ్చేందుకు రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నట్లుగా వెల్లడించారు. మూడునెలల క్రితం అమెరికాకు వచ్చిన వేళలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికారులు తనను సంప్రదించలేదన్నారు. కేసు నమోదైన సంగతి తెలిసిన తర్వాత దర్యాప్తు అధికారితో పాటు.. ఉన్నతాధికారుల్నిసంప్రదించినట్లుగా పేర్కొన్నారు.

మార్చి 23న హైదరాబాద్ కమిషనర్ .. వెస్ట్ జోన్ డీసీపీని సంప్రదించి దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పానని.. కుటుంబ సభ్యుల్ని వేధించొద్దని కోరినట్లుగా పేర్కొన్నారు. అమెరికాలోని తన కాంటాక్టు నెంబరును షేర్ చేశానని.. అయినప్పటికీ కేసు గురించి అధికారులు తనను సంప్రదించలేదన్నారు. వైద్య పరీక్షల తర్వాత ప్రయాణం చేయొచ్చని వైద్యులు చెప్పినంతనే భారతదేశానికి తిరిగి రానున్నట్లుగా పేర్కొన్నారు. తన అమెరికా ప్రయాణం గురించి తన కొడుకు నిషాంత్ రావును పోలీసులు అడగ్గా.. అతను తన సమాచారాన్ని ఇచ్చినట్లుగా ప్రభాకర్ రావు అఫిడవిట్ లో పేర్కొన్నారు. దీనిపై పోలీసు అధికారులు కోర్టుకు ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.