Begin typing your search above and press return to search.

ఫోన్ ట్యాపింగ్ కేసు: 3 రోజుల్లో ఇండియాకు రావాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.

By:  Tupaki Desk   |   29 May 2025 5:00 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు: 3 రోజుల్లో ఇండియాకు రావాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం!
X

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయడమే కాకుండా, ఇండియాకు తిరిగి వచ్చేందుకు పాస్‌పోర్ట్‌ను కూడా మంజూరు చేసింది.

సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభాకర్ రావును మూడు రోజుల్లోపు ఇండియాకు రావాలని ఆదేశించింది. అంతేకాకుండా, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం, మూడు రోజుల్లో ఇండియాకు వచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని వెంటనే అండర్‌టేకింగ్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతానికి ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

గతంలో, ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ లభిస్తే ఇండియాకు తిరిగి వస్తానని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, తెలంగాణ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో, మే 9న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు సవాల్ చేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్‌కు తిరిగి వస్తానని పిటిషన్‌లో వెల్లడించారు. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీం ధర్మాసనం.. ప్రభాకర్‌ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పాటు వెంటనే ఇండియాకు తిరిగి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా, తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్ వేయగా, అందుకు అమెరికా ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. మరోవైపు జూన్ 20 లోపు కోర్టులో హాజరుకావాలని, లేదంటే ప్రకటిత నేరస్థుడిగా ప్రకటిస్తామంటూ నాంపల్లి కోర్టు ఇటీవల స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఇంటి గోడకు పోలీసులు నోటీసులు కూడా అంటించారు. అలా ప్రకటిస్తే ప్రభాకర్ రావు ఆస్తులను కూడా జప్తు చేసే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుంది.