ఏపీ హైకోర్టు ప్రశ్న: పవన్ కల్యాణ్ కేసు ప్రత్యేక కోర్టు ఎందుకు?
వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 April 2025 9:30 AM ISTవారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లటం మహిళల అపహరణకు కారణమవుతోందన్న మాటలు పెను దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై అప్పటి వైసీపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్ మీద క్రిమినల్ కేసును దాఖలు చేసింది. ఈ సందర్భంగా సదరు అంశంపై ఐదుగురు వాలంటీర్లు అఫిడవిట్లు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ క్రిమినల్ కేసుకు సంబంధించిన అఫిడవిట్లు ఇచ్చిన వాలంటీర్లు.. వైసీపీ నేతలు తమ నుంచి సంతకాలు తీసుకొని కోర్టులో పిటిషన్ వేశారని పేర్కొన్నారు.
దీంతో.. పవన్ కల్యాణ్ పై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి గత ఏడాది నవంబరు 18న ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు ఉత్తర్వు జారీ చేశారు. ఇదే సమయంలో ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కె.సరళ మరో ముగ్గురు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ కేసు దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రజాప్రతినిధి కాబట్టి.. ఈ కేసును ప్రజాప్రతినిదుల కేసుల్ని విచారించే ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి.. ఈ కేసు నమోదు అయ్యే నాటికి పవన్ కల్యాణ్ ప్రజాప్రతినిధి కాదు కదా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘అలాంటప్పుడు కేసు విచారణను ప్రజాప్రతినిధుల కోర్టుకు పంపాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. అదే సమయంలో ఈ సందేహంపై వాదనలు వినిపించాలంటూ న్యాయవాదుల్ని కోరుతో విచారణను వాయిదా వేశారు. దీంతో.. ఈ కేసులో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
