ఒకసారి మాజీ ప్రియుడిని కలిస్తే అది అడల్ట్రీ కాదు: పంజాబ్-హర్యానా హైకోర్టు
భార్య ఓసారి మాజీ ప్రియుడిని కలిసిందనే కారణంతో ఆమెపై వివాహేతర సంబంధం ఆరోపణలు చేయలేమని పంజాబ్-హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది.
By: A.N.Kumar | 27 May 2026 7:00 PM ISTభార్య ఓసారి మాజీ ప్రియుడిని కలిసిందనే కారణంతో ఆమెపై వివాహేతర సంబంధం ఆరోపణలు చేయలేమని పంజాబ్-హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లికి ముందు ఉన్న సంబంధాన్ని కూడా పెళ్లి తర్వాత అడల్ట్రీగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. అనుమానాలు, గత సంబంధాలు.. చట్టపరంగా నిరూపించగలిగే అక్రమ సంబంధాల మధ్య స్పష్టమైన తేడా ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
“2023 జనవరి 11న భార్య తన మాజీ పరిచయస్తుడిని ఒక్కసారి కలవడం మాత్రమే ఆధారంగా తీసుకుని ఆమె అక్రమ సంబంధంలో ఉందని చెప్పలేం. అలాగే పెళ్లికి ముందు ఉన్న సంబంధం కూడా పెళ్లి తర్వాత అడల్ట్రీగా మారదు” అని ధర్మాసనం పేర్కొంది.
ఈ కేసు 2021 నవంబర్ 16న జరిగిన వివాహానికి సంబంధించినది. ఈ దంపతులకు సంతానం లేదు. భారత నౌకాదళంలో పనిచేస్తున్న భర్త, పెళ్లి తర్వాత కూడా తన భార్య మరో వ్యక్తితో సంబంధం కొనసాగించిందని ఆరోపించాడు.
భర్త వాదన ప్రకారం.. భార్య తరచూ గొడవపడేదని, ఆలస్యంగా ఇంటికి వచ్చేదని, తనతో కలిసి పడుకోవడానికి నిరాకరించేదని, ఎక్కువ సమయం ఫోన్‌లో ఇతరులతో మాట్లాడేదని తెలిపాడు. ఆమెకు పెళ్లికి ముందే మరో వ్యక్తితో సంబంధం ఉందని తరువాత తెలిసిందని పేర్కొన్నాడు.
అలాగే 2023 జనవరి 11న భార్యను ఆ వ్యక్తి ఇంట్లో “అనుచిత పరిస్థితుల్లో” చూసినట్లు ఆరోపిస్తూ ఆమె తండ్రి,, సోదరుడిని అక్కడికి పిలిపించానని తెలిపాడు.
ఇక భార్య మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. తన భర్త కుటుంబం కట్నం కోసం వేధించిందని, మామ తనపై చెడ్డ చూపు చూశాడని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్లో అనేక విరుద్ధతలు ఉన్నాయని ఫ్యామిలీ కోర్టు గుర్తించింది.
భార్య చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని, కట్నంగా బుల్లెట్ బైక్ ఇచ్చినట్లు చెప్పినా క్రాస్ ఎగ్జామినేషన్‌లో అలాంటిదేమీ జరగలేదని ఆమె అంగీకరించిందని కోర్టు తెలిపింది. భర్త కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం క్రూరత్వంగా పరిగణించవచ్చని ఫ్యామిలీ కోర్టు అభిప్రాయపడింది.
దీంతో ఫ్యామిలీ కోర్టు వివాహ బంధాన్ని రద్దు చేసింది. అయితే అది అడల్ట్రీ ఆధారంగా కాదు.. భార్య ప్రవర్తనలో క్రూరత్వం ఉన్నందునే అని హైకోర్టు స్పష్టం చేసింది. చివరకు భార్య దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది.
