Begin typing your search above and press return to search.

సంచలనం.. ఓఎంసీ మైనింగ్ కేసులో గాలికి ఏడేళ్ల జైలు.. సబిత నిర్దోషి!

ఇన్నేళ్ల విచారణ తర్వాత మంగళవారం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది.

By:  Tupaki Desk   |   6 May 2025 4:49 PM IST
సంచలనం.. ఓఎంసీ మైనింగ్ కేసులో గాలికి ఏడేళ్ల జైలు.. సబిత నిర్దోషి!
X

ఉమ్మడి ఏపీని ఓ ఊపు ఊపిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో తీర్పు వెలువడింది.. హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఈ కేసులో మంగళవారం తీర్పు వెలువరించింది.

ఎప్పుడో 2009-10 మధ్యలో మొదలైన ఈ కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. కర్ణాటకకు చెంది మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు నిందితులుగా ఉన్న ఈ కేసు ఉమ్మడి ఏపీని కుదిపేసింది.

ఇన్నేళ్ల విచారణ తర్వాత మంగళవారం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది.

గాలి జనార్దనరెడ్డితో పాటు బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ రాజగోపాల్ ను దోషులుగా నిర్థారించిన నాంపల్లి సీబీఐ కోర్టు వీరికి శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దనరెడ్డితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

సబితకు బిగ్ రిలీఫ్..

నిందితురాలిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఊరట లభించింది. అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ఇక ఈ కేసులో నిందితులు ఏ1 బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్దన్‌ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్‌, ఏ4 ఓఎంసీ కంపెనీ, ఏ7 కె.మెఫజ్‌ అలీఖాన్‌ లు దోషులు.

కృపానందం ఏ8, సబితా ఇంద్రారెడ్డి ఏ9గా ఉన్నారు. ఇప్పటికే లింగారెడ్డి మృతిచెందారు. ఏ6గా ఉన్న శ్రీలక్ష్మిని 2022లో కేసు నుంచి తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి చేసింది.