Begin typing your search above and press return to search.

ఆ ముఖ్యమంత్రి విడాకుల కేసుపై సుప్రీం కీలక సూచన

జమ్మూకశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాఖలు చేసుకున్న విడాకుల కేసుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక సూచన చేసింది.

By:  Tupaki Desk   |   17 April 2025 2:00 PM IST
ఆ ముఖ్యమంత్రి విడాకుల కేసుపై సుప్రీం కీలక సూచన
X

జమ్మూకశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాఖలు చేసుకున్న విడాకుల కేసుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక సూచన చేసింది. ఆయన తన భార్య పాయల్ అబ్దుల్లాతో కూర్చొని మరోసారి మాట్లాడుకోవాలని చెప్పింది. తమ మధ్య ఉన్న వివాదాల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని ఆదేశించింది. క్రూరత్వం కారణంగా భార్య పాయల్ నుంచి విడాకులు కోరుతూ ఒమర్ అబ్దుల్లా పిటిషన్ దాఖలు చేశారు.

అయితే.. వీరిద్దరూ కొన్నేళ్లుగా విడివిడిగానే జీవిస్తున్నారు. ఆమెతో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ 2016లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు ఒమర్ అబ్దుల్లా. కానీ.. అందుకు కోర్టు తిరస్కరించింది. దీన్ని సవాలుచేస్తూ 2023లో ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అక్కడ కూడా ఒమర్ కు నిరాశే మిగిలింది.

కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన నేపథ్యంలో గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి పాయల్ కు నోటీసు జారీ చేసి ఆమె సమాధానాన్ని కోరింది అత్యున్నత న్యాయస్థానం. విడాకుల కేసును దాఖలు చేస్తూ.. ఒమర్ తరఫు వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. గడిచిన పదిహేనేళ్లుగా ఈ ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారని.. వీరి పెళ్లి ముగిసినట్లుగా వాదనలు వినిపించారు.

దీనికి స్పందించిన సుప్రీంకోర్టు ద్వి సభ్య ధర్మానం వివాదానికి కారణమైన అంశాలపై నిజాయితీగా.. శాంతియుతంగా చర్చించుకోవాలని పేర్కొన్నారు. ఈ కేసులో కౌన్సెలింగ్ ప్రక్రియ విఫలమైందని.. వారికి మరో అవకాశం ఇవ్వాలని తాము భావిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు జస్టిస్ సుధాంశు ధులియా.. జస్టిస్ వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఇద్దరిని కలిసి కూర్చొని మరోసారి చర్చించాలని..ఈ ప్రక్రియ మూడు వారాల్లో పూర్తి కావాలని పేర్కొంది. తదుపరి విచారణను మే ఏడుకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.