Begin typing your search above and press return to search.

'భార్య సంపాదిస్తుంటే భర్త భరణం ఇవ్వాలా?'... ముంబై హైకోర్టు తీర్పిదే!

భార్య, భర్తల విడాకుల కేసులకు సంబంధించి ఉన్నత న్యాయస్థానాల్లోనూ, సర్వోన్నత న్యాయస్థానంలోనూ పలు సంచలన తీర్పులు వెలువడుతున్న సంగతి తెలిసిందే!

By:  Tupaki Desk   |   27 Jun 2025 11:06 AM IST
భార్య సంపాదిస్తుంటే భర్త భరణం ఇవ్వాలా?...  ముంబై హైకోర్టు తీర్పిదే!
X

భార్య, భర్తల విడాకుల కేసులకు సంబంధించి ఉన్నత న్యాయస్థానాల్లోనూ, సర్వోన్నత న్యాయస్థానంలోనూ పలు సంచలన తీర్పులు వెలువడుతున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో తాజాగా విడాకులు పొందిన భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే భర్త భరణం చెల్లించాలా అనే వ్యవహారానికి సంబంధించి ముంబై హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది!

అవును... విడాకులు పొందిన దంపతుల్లో భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తున్నప్పటికీ భర్త ఆమెకు భరణం చెల్లించాలా అనే విషయంపై ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా... భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తున్నప్పటికీ భర్త ఆమెకు భరణం చెల్లించాల్సి ఉంటుందని ముంబై హైకోర్టు జస్టిస్‌ మంజుషా దేశ్‌ పాండే స్పష్టం చేశారు.

భార్య గౌరవప్రదమైన జీవనం కోసం నెలకు రూ.15వేలను భరణం కింద చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసిన భర్త పిటిషన్‌ ను ధర్మాసనం కొట్టివేసింది. భార్య ఉద్యోగం చేస్తూ నెలకు రూ.25వేలు సంపాదిస్తున్నందున భరణం చెల్లించాల్సిన అవసరంలేదన్న భర్త వాదనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఈ క్రమంలో... నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్న భర్తకు ఇతరత్రా ఆర్థికపరమైన బాధ్యతలేవీ లేవని ధర్మాసనం గుర్తించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే భార్యకు భరణం చెల్లించాల్సిందే అంటూ, ఆమెకు అనుకూలమైన నిర్ణయాన్ని వెలువరించింది!