Begin typing your search above and press return to search.

ఎంపీ మిథున్ రెడ్డిపై థర్డ్ డిగ్రీ .. కోర్టు ఏం చెప్పిందంటే..!

ఈ సందర్భంగా ఆయన విషయంలో పోలీసులు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను వివరిస్తూ ఆదేశాలిచ్చింది.

By:  Tupaki Desk   |   19 Sept 2025 1:06 PM IST
ఎంపీ మిథున్ రెడ్డిపై థర్డ్ డిగ్రీ .. కోర్టు ఏం చెప్పిందంటే..!
X

లిక్కర్ స్కాంలో అరెస్టు అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రెండు రోజుల పోలీసుకస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన విషయంలో పోలీసులు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను వివరిస్తూ ఆదేశాలిచ్చింది. లిక్కర్ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డిని ఇంకా లోతుగా విచారించాల్సిఉందని, ఆయనను 5 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీఐడీ సిట్ అధికారులు పిటిషన్ వేయగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.

డిస్టలరీల నుంచి కమీషన్ల వసూలులో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అనుమానిస్తోంది. దీనిపై పూర్తిస్థాయి వివరాల సేకరణకు మిథున్ రెడ్డిని విచారించాలని సిట్ కోర్టును ఆశ్రయించింది. సిట్ పిటిషన్ పై చాలా రోజులు విచారణ జరగగా, తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో మిథున్ రెడ్డి విషయంలో పోలీసులు ఎలా వ్యవహరించాలనేది స్పష్టం చేస్తూ కొన్ని షరతులు విధించింది. విచారణ సమయంలో మిథున్ రెడ్డిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని షరతు విధించింది. ఎంపీగా ఉన్న వ్యక్తి తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే అంశాన్ని కోర్టుకు ద్రుష్టికి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.

అంతేకాకుండా విచారణ సమయంలో మిధున్ రెడ్డిని మానసికంగా వేధించకూడదని స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విచారించాలని సూచించింది. రెండు పూటల ఆయన కోరుకున్న ఆహారం ఇవ్వడంతోపాటు న్యాయవాదిని అనుమతించాలని, విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేయాలని షరతు విధించింది. అదే సమయంలో కేసుతో సంబంధం లేని వ్యక్తులను విచారణలో జోక్యం చేసుకోకుండా చూడాలని ఏసీబీ కోర్టు సూచించింది. సిట్ నియమించిన అధికారులు మాత్రమే నిందితుడిని విచారించాల్సివుందని స్పష్టం చేసింది.

కాగా, అంతిమ లబ్దిదారును గుర్తించే పనిలో ఉన్న సిట్.. ఎంపీ మిథున్ రెడ్డిని రెండోసారి కస్టడీలోకి తీసుకోవడం ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు ఈ కేసులో జోక్యం చేసుకున్న ఈడీ పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతోంది. మరోవైపు డిపాల్ట్ బెయిల్ పొందిన ముగ్గురు నిందితుల బెయిల్ రద్దు చేయాలని సిట్ హైకోర్టులో పోరాడుతోంది. ఇదే సమయంలో ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోవడం ద్వారా నిందితుల్లో గుబులు రేకెత్తించడమే సిట్ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. జులై నెలలో అరెస్టు అయిన మిథున్ రెడ్డిని ఇప్పటికే ఒకసారి పోలీసు కస్టడీలో తీసుకుని విచారించారు. మళ్లీ ఇప్పుడు విచారణకు తీసుకోవడానికి ఏంటి కారణమన్న చర్చ జరుగుతోంది.