సుప్రీంలో మిథున్ రెడ్డి విజయం.. లిక్కర్ స్కాంలో బిగ్ అప్డేట్
ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుడుగా ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గొప్ప ఊరట లభించింది.
By: Tupaki Desk | 13 May 2025 3:07 PM ISTఏపీ లిక్కర్ స్కాంలో నిందితుడుగా ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గొప్ప ఊరట లభించింది. ఇప్పటికే సుప్రీంకోర్టు రక్షణతో అరెస్టు నుంచి రక్షణ పొందిన మిథున్ రెడ్డికి అనుకూలంగా సుప్రీం తీర్పు వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో మరోమారు ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పు వెలువరించేవరకు ఆయనను అరెస్టు చేయొద్దంటూ సుప్రీం తీర్పునిచ్చింది. అంతేకాకుండా మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏపీ మద్యం స్కాంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఏ2 నిందితుడిగా అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న కారణంగా ఎంపీ మిథున్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించాల్సివచ్చింది. మిథున్ రెడ్డి పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పించి, విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశించింది.
దీంతో గతంలో జరిగిన సిట్ విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇక తాజాగా జరిగిన వాదనల్లోనూ సిట్ ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని మిథున్ రెడ్డి కోర్టుకు తెలిపారు. దీంతో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. అరెస్టులు యాంత్రికంగా జరగకూడదని వ్యాఖ్యానించింది. మిథున్ రెడ్డి మరోసారి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలిచ్చింది.
అదేవిధంగా మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను నాలుగు వారాల్లో పరిష్కరించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్టుకు సరైన కారణాలు చూపించాల్సివుంటుందని వ్యాఖ్యానించిన సుప్రీం ధర్మాసనం కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని అనుకోవడం సరైనది కాదని వ్యాఖ్యానించింది. పార్లమెంటు సభ్యుడి పరువు ప్రతిష్ఠలను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం సూచించింది.
