Begin typing your search above and press return to search.

మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ..ఏ క్షణమైనా అరెస్టు

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

By:  Tupaki Desk   |   18 July 2025 1:27 PM IST
మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ..ఏ క్షణమైనా అరెస్టు
X

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ మద్యం స్కాంలో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రెండు రోజుల క్రితం హైకోర్టులో ఆయనకు ఊరట లభించకపోవడంతో బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తీవ్రమైన అభియోగాలు ఉండటంతో ఎంపీ మిథున్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అంతేకాకుండా లొంగిపోయేందుకు కూడా ఆయనకు సమయం ఇవ్వలేదు. దీంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి భయపడినట్లే జరుగుతోంది. మద్యం స్కాంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. విచారణ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఆయనకు ఊరట దక్కలేదు. దీంతొ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే మిథున్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఏ4 నిందితుడిని అరెస్టు చేయకుండా కోర్టులో చార్జిషీటు ఎలా దాఖలు చేశారని సిట్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మిథున్ రెడ్డి పెట్టుకున్న బెయిలు పిటిషనును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.

మిథున్ రెడ్డి పిటిషన్ పై జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. ముందస్తు బెయిలు పొందడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది నుంచి సరైన సమాధానం లభించకపోవడంతో ముందస్తు బెయిలు పిటిషన్ ను డిస్మస్ చేసింది. దీంతో వైసీపీ ఎంపీ అరెస్టుకు లైన్ క్లియర్ అయినట్లేంది. మార్చిలో మిథున్ రెడ్డిపై అభియోగాలు మోపిన నుంచి న్యాయస్థానాల ద్వారా ఆయన అరెస్టు కాకుండా రక్షణ పొందుతూ వచ్చారు. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో మిథున్ రెడ్డి జాడ తెలుసుకునేందుకు గాలింపు తీవ్రం చేసినట్లు చెబుతున్నారు.