Begin typing your search above and press return to search.

పెళ్లి ప్రపోజల్ ముందుకు వెళ్లకుంటే మోసం కాదు

పెళ్లికి సంబంధించిన ఒక కేసులో ఆసక్తికర తీర్పును ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   29 Feb 2024 9:30 AM GMT
పెళ్లి ప్రపోజల్ ముందుకు వెళ్లకుంటే మోసం కాదు
X

పెళ్లికి సంబంధించిన ఒక కేసులో ఆసక్తికర తీర్పును ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. పెళ్లి ప్రపోజల్ ముందుకు వెళ్లి.. ఎంగేజ్ మెంట్ అయ్యాక పెళ్లి కాని పక్షంలో.. దాన్నో నేరంగా.. మోసం చేసినట్లుగా పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. పెళ్లికి సంబంధించి.. ఒక సంబంధం గురించి అనుకొని.. పెళ్లి వరకు వెళ్లకపోవటానికి చాలానే కారణాలు ఉండొచ్చు. అయితే.. అన్నింటిని మోసం కోణంలో చూడలేమని సుప్రీం పేర్కొంది. మోసం ఆరోపణను రుజువు చేయాలంటే మోసం చేయాలన్న ఉద్దేశం మొదటి రోజు నుంచి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే..

తనను పెళ్లి చేసుకుంటానని ఎంగేజ్ మెంట్ అయ్యాక పెళ్లి చేసుకోకుండా మరో అమ్మాయితో వివాహం జరిగిన ఉదంతం కర్ణాటకలో చోటు చేసుకుంది. దీంతో.. వరుడు రాజు మీద చీటింగ్ కేసును నమోదు చేవారు. తమ పెళ్లి ఎంగేజ్ మెంట్ అయ్యాక.. తాము ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకున్నామని.. పెళ్లి మండపం కోసం తన తండ్రి రూ.75 వేలు అడ్వాన్సు కూడా ఇచ్చినట్లుగా సదరు పెళ్లి కుమార్తె కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు.. రాజుకు మరో అమ్మాయితో పెళ్లైందని చెబుతూ.. తనను మోసం చేసినట్లుగా ఆమె ఆరోపించారు

ఈ ఫిర్యాదుపై స్పందించిన స్థానిక పోలీసులు రాజు మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు కోర్టు ఎదుట వచ్చింది. సెక్షన్ 417 కింద రాజు మోసం చేశారని పేర్కొంటూ అతనిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ ఉదంతంలో కర్ణాటక హైకోర్టు.. రాజును దోషిగా తేలుస్తూ.. తన తీర్పును ఇచ్చింది. దీనిపై రాజు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2021లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఈ కేసుపై తాజాగా తీర్పును ఇచ్చారు.

జస్టిస్ సుధాంశు ధూలియా.. జస్టిస్ ప్రసన్నా బి.వరాలేతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కర్ణాటక హైకోర్టు తీరపును తోసిపుచ్చింది. ఒక నిర్దిష్ట సందర్భంలో మోసం ఉండొచ్చని.. ఇలాంటి కేసుల్లో నేర నిరూపణకు మొదట్నించి మోసం చేసే ఉద్దేశం.. దానికి సంబంధించిన బలమైన సాక్ష్యాలు ఉండాలని పేర్కొంది. ఈ ఉదంతంలో యువతిని మోసం చేసే ఉద్దేశం రాజులో కనిపించటం లేదని పేర్కొంది. అంతేకాదు.. ఈ కేసులో పెట్టిన సెక్షన్ 417 కింద దీన్నో నేరంగా చూడరాదని స్పష్టం చేసింది.