అత్తారింటికి ‘దూరంగా’ ఉంటే.. మొగుడికి ‘దూరమైనట్టు’ కాదు.. మద్రాస్ హై కోర్టు వ్యాఖ్య
పిల్లలు పుట్టిన తర్వాత భార్య తన తల్లిదండ్రుల దగ్గర ఉండడం నేరం కాదు.. అది మిమ్మల్ని వదిలేసినట్టు కూడా కాదు’ అని చెప్పింది.
By: Tupaki Desk | 12 May 2026 3:50 PM ISTభార్యాభర్తల మధ్య గొడవలు రావడం, భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం మన సినిమాల్లోనూ, గల్లీల్లోనూ చూస్తూనే ఉంటాం. అయితే, ఇలా పుట్టింటికి వెళ్లడాన్ని సాకుగా చూపి ‘నా భార్య నన్ను వదిలేసింది.. నాకు విడాకులు ఇచ్చేయండి’ అని కోర్టుల చుట్టూ తిరిగే భర్తలకు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ‘పిల్లలు పుట్టిన తర్వాత భార్య తన తల్లిదండ్రుల దగ్గర ఉండడం నేరం కాదు.. అది మిమ్మల్ని వదిలేసినట్టు కూడా కాదు’ అని చెప్పింది. ఆర్ పాండి @ ముత్తుపాండి అండ్ ఎం శరణ్య కేసులో వెలువడిన ఈ తీర్పు, విడాకుల కోసం ‘షార్ట్‌కట్’ వెతికే భర్తల ఆశలపై నీళ్లు చల్లింది. పెళ్లిలో ‘నీ కోసం ఏమైనా చేస్తా’ అన్న భర్త, తీరా పెళ్లయ్యాక భార్య పుట్టింటికి వెళ్తే దాన్ని ‘కుట్ర’గా చూడడంపై కోర్టు చురకలు అంటించింది.
శరణ్యం కోరిన శరణ్య.. విడాకుల పంతంతో పాండి!
ఈ కేసులో ముత్తుపాండి వాదన చాలా విచిత్రంగా ఉంది. తన భార్య శరణ్య గర్భంతో పుట్టింటికి వెళ్లి అక్కడే ఉండిపోయిందని, తన బాధ్యతలను విస్మరించిందని, కాబట్టి ఇది 'డెసర్షన్' (Desertion) కిందకు వస్తుందని ఆయన కోర్టులో వాదించారు. అంటే, భార్య పుట్టింటికి వెళ్లిందంటే భర్తను శాశ్వతంగా వదిలేసినట్టే అన్నమాట! ఈయన లాజిక్ ప్రకారం చూస్తే, డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లే ప్రతి భార్య విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్టే. భార్యను తన ఇంటికి రప్పించుకోవడానికి ప్రయత్నించడం మానేసి, నేరుగా విడాకుల కోసం కోర్టుకు రావడం ముత్తుపాండి 'అత్యుత్సాహాన్ని' చూపిస్తోంది.
పుట్టిల్లు పరాయి ఇల్లు కాదు! కోర్టు క్లాస్
ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు అద్భుతమైన పాయింట్ లేవనెత్తింది. ఒక మహిళ బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చినప్పుడు.. జన్మనిచ్చిన తర్వాత శారీరకంగా, మానసికమైన మద్దతు కోసం తన తల్లిదండ్రులపై ఆధారపడడం సహజమని స్పష్టం చేసింది. దీన్ని ‘భర్తను వదిలేయడం’ అని పిలవడం మూర్ఖత్వమే అవుతుందని అభిప్రాయపడింది. భార్య పుట్టింట్లో ఉండడం అనేది ‘తాత్కాలికమైన ఏర్పాటు’ మాత్రమే తప్ప, అది భర్తతో బంధాన్ని తెంచుకోవడం కాదని జడ్జి క్లాస్ పీకారు. ‘భార్యను జాగ్రత్తగా చూసుకోవడం చేతకాక, ఆమె తన పుట్టింటికి వెళ్తే దాన్ని వంకగా పెట్టుకుని విడాకులు అడగటం ఏంటి?’ అని కోర్టు వేసిన ప్రశ్నలకు ముత్తుపాండి వద్ద సమాధానం లేదు.
బెడిసికొట్టిన స్కెచ్!
చాలా మంది భర్తలు విడాకులు పొందడానికి ‘క్రూరత్వం’ లేదా ‘వదిలి వెళ్లిపోవడం’ అనే కారణాలను వాడుకుంటారు. ముత్తుపాండి కూడా శరణ్య తనను కావాలనే ఇబ్బంది పెడుతోందని, పుట్టింటికి వెళ్లి తన వైవాహిక జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. కానీ కోర్టు మాత్రం.. ‘ఆమె పుట్టింటికి వెళ్లడానికి బలమైన కారణాలున్నాయి, అక్కడ ఉండడం వల్ల భర్తకు ఆమెపై ఉన్న హక్కులు ఏమీ పోవు’ అని తేల్చింది. అంటే, భార్య పుట్టింటికి వెళ్లడం అనేది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్యానికి సంబంధించిన విషయం తప్ప, అది విడాకులకు గ్రౌండ్ కాదని పేర్కొంది.
భర్తలకు ఒక హెచ్చరిక..
ఈ తీర్పు చూసిన తర్వాత చాలా మంది భర్తల్లో ఒక రకమైన నిరుత్సాహం నెలకొనవచ్చు. ‘ఇంటికి రాకపోతే విడాకులు ఇచ్చేస్తా’ అని బెదిరించే కాలం పోయింది. భార్య తన పుట్టింటి వద్ద ఉండడం వల్ల భర్తకు కలిగే ‘ఇగో’ సమస్యలకు కోర్టులు మందు వేయవు. సామాజిక బాధ్యతలను, కుటుంబ బంధాలను విస్మరించి కేవలం సాంకేతిక కారణాలతో విడాకులు పొందాలనుకుంటే, మద్రాస్ హైకోర్టు లాంటి తీర్పులే ఎదురవుతాయి. ముత్తుపాండి స్కెచ్ లో ఉన్న లొసుగును కోర్టు ఎండగట్టడం ద్వారా, శరణ్య లాంటి ఎంతో మంది మహిళలకు ఒక రక్షణ కవచం దొరికినట్లయింది.
మొత్తానికి, ముత్తుపాండికు కోర్టు ‘ఫ్యామిలీ లైఫ్’ మీద ఒక లాంగ్ క్లాస్ తీసుకుంది. పుట్టింటికి వెళ్లిన భార్యను ప్రేమతో తెచ్చుకోవాలి కానీ, లీగల్ నోటీసులతో కాదని ఈ తీర్పు మరోసారి గుర్తు చేసింది!
