వివాహానికి ముందు వైద్య పరీక్షలు.. ఎంత వరకు కరెక్ట్?
వివాహానికి ముందు వైద్య పరీక్షలను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఇటీవల కొట్టివేసింది
By: Tupaki Desk | 5 July 2025 3:00 PM ISTవివాహానికి ముందు వైద్య పరీక్షలను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఇటీవల కొట్టివేసింది. ఈ విషయంలో చట్టాలు రూపొందించే అధికారం శాసనసభలకే ఉందని స్పష్టం చేసింది.
మదురైకి చెందిన రమేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌లో, వివాహానంతరం దంపతుల మధ్య పెరుగుతున్న వివాదాలకు, తద్వారా విడాకుల సంఖ్య పెరగడానికి ఆరోగ్యపరమైన, లైంగికపరమైన లోపాలు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ఈ సమస్యల కారణంగా అనేక కుటుంబాలు మానసికంగా, భావోద్వేగంగా ఇబ్బందులు పడుతున్నాయని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో వివాహానికి ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి అని ఉదాహరణలిస్తూ భారతదేశంలో కూడా అలాంటి విధానాన్ని ప్రవేశపెట్టి, వివాహపూర్వ వైద్య పరీక్షలను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని ఆయన అభ్యర్థించారు.
జస్టిస్ ఎస్.ఎం. సుబ్రహ్మణ్యం, జస్టిస్ శ్రీమతి సమితితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. వివాహానికి ముందు వైద్య పరీక్షలను తప్పనిసరి చేయాలనే అంశం చట్టసభల అధికార పరిధిలోకి వస్తుందని, ఈ విషయంలో కోర్టులు నేరుగా ఆదేశాలు జారీ చేయలేవని న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. "ఇలాంటి చట్టాలు తేవాల్సిన బాధ్యత పార్లమెంటు వద్దే ఉంది. కోర్టు అలాంటి నిర్ణయాలను తీసుకోవడం సాధ్యపడదు. ప్రభుత్వానికి ఇటువంటి అంశాల్లో నేరుగా ఆదేశాలు ఇవ్వడం కోర్టు పరిధిలోకి రాదు," అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
ఈ తీర్పు భారత సమాజంలో వివాహ జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్య భద్రతల మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతపై తదుపరి చర్చలకు దారితీయనుంది. వివాహానికి ముందు వైద్య పరీక్షల అంశంపై పార్లమెంటులో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం పరోక్షంగా సూచించింది. భవిష్యత్తులో ఈ అంశంపై శాసనసభలో ఏ విధమైన చర్చలు జరుగుతాయో వేచి చూడాలి.