Begin typing your search above and press return to search.

ఒక్క రోజే లక్షల్లో కేసులు రాజీ.. ఎక్కువగా ఏ కేసులంటే..?

ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే చిన్న చిన్న సమస్యలను సైతం కోర్టు వరకు తీసుకెళ్లి సంవత్సరాలుగా వాటి చుట్టూ తిరుగుతున్నారు.

By:  Tupaki Desk   |   15 Sept 2025 11:50 AM IST
ఒక్క రోజే లక్షల్లో కేసులు రాజీ.. ఎక్కువగా ఏ కేసులంటే..?
X

ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే చిన్న చిన్న సమస్యలను సైతం కోర్టు వరకు తీసుకెళ్లి సంవత్సరాలుగా వాటి చుట్టూ తిరుగుతున్నారు. దీంతో విలువైన జీవితం, డబ్బు కోల్పోతున్నారు. ఇప్పటికీ కోర్టుల్లో ఇరు వైపులా కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే కేసులు ఎన్నో ఉన్నాయి. కానీ ఈగోలకు పోయి పరిష్కరించుకోవడం లేదు. రాజీ కుదుర్చుకోవాలని న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రతి వాయిదాలో చెప్పినా ఎవరూ వినరు దీంతో కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాకుండా.. ఇరు వైపులా జీవితాలు నాశనం అవుతున్నాయి. ‘కేసు ఓడిన వారు కోర్టులో ఏడుస్తాడు.. కేసు గెలిచిన వారు ఇంటి వద్ద ఏడుస్తారు.’ ఇరు వైపులా జీవితాలు నాశనం తప్పదు. ఎందుకంటే అభియోగం మోపిన వారితో పాటు కేసు వేసిన వారు కూడా ప్రతి వాయిదాకు హాజరవ్వాలి. దీంతో ఇరు వైపులా సమయం వృథానే అవుతుంది.

ఇలా జరగకుండా ఉండేందుకు.. కోర్టులపై ఉన్న బరువును సైతం తగ్గించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇవి రెండు రకాలు ఒకటి జాతీయ లోక్ అదాలత్.. రెండోది రాష్ట్ర లోక్ అదాలత్.. జాతీయ లోక్ అదాలత్ క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. దీని తేదీని జాతీయ న్యాయసేవా సంస్థ ప్రకటిస్తుంది. ఇక రాష్ట్రీయ లోక్ అదాలత్ స్థానిక పరిస్థితులను బట్టి ఎప్పుడు అవసరమో అప్పుడే నిర్వహిస్తారు. ఇటీవల సెప్టెంబర్ 2, 2025 నుంచి 13 సెప్టెంబర్, 2025 వరకు లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సారి పెద్ద ఎత్తులో కేసులు పరిష్కారం అయినట్లు న్యాయవాదులు చెప్తున్నారు.

లోక్ అదాలత్ లో 11.08 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయని సీఐడీ డీజీ చారుసిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీం ఆదేశాల మేరకే ఇరు పక్షాలను కూర్చోబెట్టి వారి మధ్య రాజీ కుదిర్చి కేసులు పరిష్కరించినట్లు ఆమె వివరించారు. 4539 మందికి రూ. 12.94 కోట్ల రీఫండ్ అందజేశామని చెప్పారు. దీనికి ముందు జరిగిన అదాలత్ లో 2,501 మందికి రూ. 27.91 కోట్లు అందజేశామని మొత్తంగా 7,040 మందికి కలిపి రూ. 40.86 కోట్ల రీఫండ్ అప్పగించినట్లు చెప్పారు.

ఇక ఏడాది కాలంను పరిశీలిస్తే.. 2024 నుంచి సెప్టెంబర్, 2025 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 36,786 మందికి రూ. 321 కోట్ల రీఫండ్ అప్పగించినట్లు సీఐడీ డీజీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన అదాలత్ లలో సైబర్ నేరాలకు సంబంధించి రూ. 138.04 కోట్ల ఫ్రీజింగ్ అమౌంట్ ను బాధితులైన 18.872 మందికి అందజేసినట్లు ప్రకటించారు. రీఫండ్ అమౌంట్ టాప్ ఐదు ప్రాంతాలను పరిశీలిస్తే సైబరాబాద్ కమిషనరేట్ రూ. 11.51 కోట్లు, రాచకొండ రూ. 6.41 కోట్లు, హైదరాబాద్ రూ. 9.29 కోట్లు, సీఎస్బీ హెడ్ క్వార్టర్స్ రూ. 4.21 కోట్లు, సంగారెడ్డి రూ. 1.04 కోట్లు ఉందన్నారు.

పరిష్కరించిన జాబితాను పరిశీలిస్తే.. ప్రీలిటిగేషన్ 3.63 లక్షలు, పెండింగ్ కేసులు 7.43 లక్షలు ఉన్నాయని, వీటి ద్వారా లబ్ధిదారులకు రూ. 595 కోట్ల పరిహారం అందజేశామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి వివరించారు. లోక్ అదాలత్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పీ శాంకోశీ, హై కోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మౌసమి భట్టాచార్య ఆధ్వర్యంలో కొనసాగింది.