సహజీవనం చేస్తే ఆస్తిలో వాటా... కండిషన్స్ ఇవే!
అయితే.. సహజీవనం చేస్తున్న పార్టనర్ సైతం ఆస్తిలో వాటా డిమాండ్ చేయవచ్చట. కానీ.. కొన్ని రూల్స్ ఉన్నాయి!
By: Tupaki Desk | 20 July 2025 6:00 AM ISTఇటీవల కాలంలో సహజీవనాన్ని ఎంచుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే! ఇందులో యువత ఉంటున్నారు.. ఇప్పటికే వివాహమై భాగస్వామి మరణించినవారూ ఉంటున్నారు. ఈ సమయంలో మేల్ పార్టనర్ ఆస్తిలో వాటా అడిగే హక్కు ఫిమెల్ పార్టనర్ కి ఉంటుందా? అనే చర్చ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. సహజీవనం చేస్తున్న పార్టనర్ సైతం ఆస్తిలో వాటా డిమాండ్ చేయవచ్చట. కానీ.. కొన్ని రూల్స్ ఉన్నాయి!
అవును... ఒకప్పుడు సహజీవనానికి రకరకాల అర్ధాలు, నానర్ధాలు, విపరీతార్ధాలు వినిపించేవి కానీ... ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దీనిపై స్పష్టత ఇచ్చాయి. ఇందులో భాగంగా... ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి చాలాకాలంగా సహజీవనం చేస్తున్నట్లైతే వారి మధ్య బంధాన్ని వైవాహిక సంబంధంగానే పరిగణించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది!
ఈ నేపథ్యంలో మేల్ పార్టనర్ కి చెందిన ఆస్తుల్లో.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఫీమేల్ పార్టనర్ కి ఉన్న హక్కులపై మాత్రం అస్పష్టత కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి.. ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తులు, వారి తదనంతరం వారసులకు లేదా రక్తసంబంధీకులకు చెందుతాయి! కొంతమంది దీనిపై స్పష్టంగా వీలునామా రాస్తారు. అయితే వీలునామా లేనప్పుడు, స్పష్టంగా ఆస్తుల పంపిణీ జరగనప్పుడు వారసుల మధ్య వివాదాలు తలెత్తుతుంటాయనేది తెలిసిన విషయమే!
ఒక వేళ వీలునామా ఉండి.. తండ్రి వీలునామాను సహజీవనం చేస్తున్న మహిళ సవాలు చేస్తే.. ఆ వీలునామా వాస్తవికతను నిరూపించే భారం ఆమెపైనా, ఆమె అర్హత నిర్ధారణ న్యాయస్థానంపైనా ఆధారపడి ఉంటుంది! ఈ సమయంలో... ఆమె చేసిన వాటా క్లెయిమ్ ను వ్యతిరేకించేందుకు వీలునామాలోని లబ్ధిదారులు అవసరమైన ఆధారాలు న్యాయస్థానానికి అందజేయాల్సి ఉంటుందని చెబుతున్నారు!
ఉదాహరణకు ఇద్దరు పిల్లల తల్లి 15 ఏళ్ల క్రితమే కన్నుమూయగా.. తండ్రి ఇటీవలే మరణించిన ఘటనను పరిశీలించొచ్చు! ఈ సమయంలో ఆస్తులను ఇద్దరు పిల్లల పేరు మీద రాశారు. అయితే మరణానికి ముందు తండ్రి ఓ మహిళతో సహజీవనం చేసేవారు. ఈ నేపథ్యంలో... తాజాగా ఆమె ఇప్పుడు ఆస్తుల్లో వాటా కోరుతోంది.
ఈ విషయంలో ఆమెకు చట్టపరంగా ఎలాంటి సపోర్ట్ ఉంటుందనేది సుప్రీంకోర్టు గత తీర్పుల్లో చర్చించింది. ఇందులో భాగంగా.. లివ్ ఇన్ రిలేషన్స్ లో భాగస్వాములకు పుట్టిన పిల్లలను చట్టబద్ధ వారసులుగా పరిగణించవచ్చని తీర్పు చెప్పింది. కానీ.. దీనికి సంబంధించి అధికారిక చట్టం లేదు! ఇదే సమయంలో... మేల్ పార్టనర్ కి చెందిన ఆస్తుల్లో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఫీమేల్ పార్టనర్ కి ఉన్న హక్కులు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి!
ఈ సమయంలో... అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా క్లెయిమ్ ల చెల్లుబాటును కోర్టు నిర్ణయిస్తుంది. ఆ సమయంలో... ఆస్తిలో వాటా పొందేందుకు ఉన్న అర్హతలను, కారణాలను సహజీవనం చేసిన మహిళ కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది!
