Begin typing your search above and press return to search.

కోర్టులో గెలిచి నిబంధనలతో ఓడిన మీనాక్షి నటరాజన్.. పరువు నష్టం కేసు తిరస్కరణ

రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అడ్డుగా నిలిచిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కి ఊరట దక్కింది.

By:  Tupaki Desk   |   13 Jun 2026 2:05 PM IST
కోర్టులో గెలిచి నిబంధనలతో ఓడిన మీనాక్షి నటరాజన్.. పరువు నష్టం కేసు తిరస్కరణ
X

రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అడ్డుగా నిలిచిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కి ఊరట దక్కింది. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో మీనాక్షి పరిస్థితిపై సానుభూతి వ్యక్తమవుతోంది. నారాయణపేటకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నారని, ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తోపాటు మరికొందరిపై ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు పెండింగులో ఉన్న విషయాన్ని తెలియజేయకుండా రాజ్యసభ నామినేషన్ వేయడంతో మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను మధ్యప్రదేశ్ లో తిరస్కరించారు. దీనిపై మీనాక్షి ఓ వైపు న్యాయపోరాటం చేస్తుండగా, మీనాక్షిపై నాంపల్లి కోర్టులో పెండింగులో ఉన్న కేసుపై శుక్రవారం తీర్పు వెలువడింది.

శివకుమార్ రెడ్డి లైంగిక వేధింపులపై మీనాక్షిపై ఆరోపణలు చేస్తూ మహిళ వేసిన పిటిషన్ ను విచారించేందుకు నాంపల్లి అదనపు మెట్రోపాలిటిన్ కేసు నిరాకరించింది. ఈ కేసును కాగ్నిజెన్స్ గా తీసుకుని సమన్లు ఇచ్చే పరిధి ఈ న్యాయస్థానానికి లేదని న్యాయాధికారి వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ నాయకుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ గతంలో కోర్టు జారీ చేసిన సమన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకోకుండానే తమ నాయకులకు సమన్లు ఇచ్చారని న్యాయవాది వాదించారు.

మహిళ దాఖలు చేసిన ఫిర్యాదు స్వభావ రీత్యా ప్రజాప్రతినిధుల కోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు అభిప్రాయపడింది. దీంతో మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన పిటిషన్ ను కోర్టు అసలు విచారించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మేజిస్ట్రేట్ కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోని ఓ ప్రైవేటు కేసు మీనాక్షి రాజ్యసభ సభ్యత్వానికి అడ్డుపడటం తీవ్ర సంచలనంగా మారింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలతో మీనాక్షి నటరాజన్ నైతికంగా గెలిచారని అంటున్నారు. అయితే అప్పటికే ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అంటున్నారు.

నాంపల్లి కోర్టు నిర్ణయంతో మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు కారణమైన కేసు ఇప్పుడు ఆమెపై లేనట్లే అంటున్నారు. ఇదే వారం రోజులు ముందు జరిగి ఉంటే మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురయ్యేది కాదని అంటున్నారు. మీనాక్షి నటరాజన్ ను దురదృష్టం వెంటాడినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు మీనాక్షి నటరాజన్ పై కేసు పెట్టిన మహిళ, ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ విషయంలో తాను న్యాయపోరాటం కొనసాగిస్తానని, నాంపల్లి కోర్టు సూచనల ప్రకారం సోమవారం ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేస్తానని స్పష్టం చేశారు.