Begin typing your search above and press return to search.

భారత్ నుంచి శరణార్థులు... తప్పుడు శిక్షణ ఇస్తున్న యూకే న్యాయవాదులు?

ఇందులో భాగంగా అలా వచ్చిన భారతీయులకు ఖలిస్థానీ ముసుగు తొడుగుతున్నారని డెయిలీ మెయిల్‌ పత్రిక వెల్లడించింది.

By:  Tupaki Desk   |   27 July 2023 11:14 AM GMT
భారత్  నుంచి శరణార్థులు... తప్పుడు శిక్షణ ఇస్తున్న యూకే న్యాయవాదులు?
X

భారత్‌ నుంచి అక్రమంగా యూకే లోకి ప్రవేశించిన శరణార్థులకు కొత్త ముసుగు వేసి ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారు అక్కడి న్యాయవాదులు. దీనికోసం చట్టాల్లోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుని ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు డెయిల్ మెయిల్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

అవును... భారత్‌ నుంచి అక్రమంగా యూకే లోకి ప్రవేశించిన శరణార్థులకు ఆ దేశంలో ఆశ్రయం కల్పించేందుకు స్థానిక న్యాయవాదులు ఒక కొత్త పంథాను అవలంబిస్తోన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా అలా వచ్చిన భారతీయులకు ఖలిస్థానీ ముసుగు తొడుగుతున్నారని డెయిలీ మెయిల్‌ పత్రిక వెల్లడించింది. దీనికోసం ఆ పత్రిక రహస్య ఆపరేషన్ ను చేపట్టినట్లు పేర్కొంది!

వివరాళ్లోకి వెళ్తే... భారత్‌ నుంచి అక్రమంగా సముద్రమార్గం ద్వారా చిన్న పడవల్లో యూకేకు చేరుకున్న భారతీయులను యూకే న్యాయవాదులు క్యాష్ చేసుకుంటున్నారని డెయిల్ మెయిల్ చెబుతోంది. వీరికి స్వదేశంలో ప్రాణహాని ఉందని కోర్టులను నమ్మిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు డెయిలీ మెయిల్ కీలక విషయాలు వెల్లడించింది.

భారత్‌ నుంచి యూకేలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి వేర్వేరు కారణాలను సాకుగా చూపి.. న్యాయస్థానాలను నమ్మిస్తున్నారట స్థానిక న్యాయవాదులు. ఇందులో భాగంఘా... కుల, మతాంతర ప్రేమ వ్యవహారాలు.. ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం.. స్వలింగ సంపర్కులు కావడం.. ఖలీస్థాన్‌ కు మద్దతు పలకడం వంటి వాటిని కారణాలుగా చూపుతున్నారట.

ఇందులో భాగంగా... అక్రమంగా వలస వచ్చిన వారిని యూకే న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు.. పైన పేర్కొన్న వాటిలో ఏదో ఒక కారణం చెప్పాలని శరణార్ధులకు న్యాయవాదులు సూచిస్తున్నారని అని సదరు పత్రిక తెలిపింది. దీనికోసం ఒక్కో శరణార్థి నుంచి 5వేలు నుంచి 10 వేల పౌండ్లు వసూలు చేస్తున్నారని వెల్లడించింది.

ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న సుమారు 40కి పైగా న్యాయ సంస్థలపై యూకే అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది. ఇదే సమయంలో ఈ పత్రిక కథనాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ ట్విటర్‌ లో షేర్‌ చేశారు. "లేబర్‌ పార్టీ, న్యాయవాదులు, క్రిమినల్‌ గ్యాంగ్‌ లు అన్ని ఒకే వైపు ఉన్నాయి. చట్టవిరుద్ధంగా శరణార్థులను దేశంలోకి తీసుకొచ్చే వ్యవస్థను వారు ప్రోత్సహిస్తున్నారు" అని ట్వీట్‌ చేశారు.

దీంతో ప్రధాని పెట్టిన ట్వీట్ తీవ్ర దుమారం రేపిందని తెలుస్తోంది. ఈ ట్వీట్ పై బ్రిటన్‌ బార్‌ కౌన్సిల్‌ ఆగ్రహం వ్యక్తం చేసిందని అంటున్నారు. బార్‌ కౌన్సిల్‌ పరిధిలోని న్యాయవాదులు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు ఆధారాలు లభిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

కాగా... యూకే శరణార్థి పాలసీని ఖలిస్తానీ మద్దతుదారులు దుర్వినియోగం చేస్తున్నారని ఆ దేశానికి భారత్ ఈ ఏడాది ఏప్రిల్ లోనే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. యూకే ఆశ్రయ ఇస్తున్న విధానం భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి వీలు కల్పిస్తోందని భారత హోం మంత్రిత్వ శాఖ, యూకే హోం మంత్రిత్వశాఖ మధ్య జరిగిన చర్చల సందర్భంగా చెప్పింది.