కౌశిక్ రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు.. ఏం జరిగింది?
బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు, హుజూరాబాద్ నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది.
By: Tupaki Desk | 16 Jun 2025 6:00 PM ISTబీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు, హుజూరాబాద్ నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని కోరుతూ .. ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టి వేసింది. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వారు.. కోర్టులను ఆశ్రయించడం మొదలు పెడితే.. కేసుల సంఖ్య పెరిగిపోతుందని పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేసును కొట్టి వేస్తున్నట్టు తెలిపింది.
దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న కౌశిక్‌రెడ్డికి భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. గత ఎన్నికలకు ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు.. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పిన పాడి.. తనను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. ఇదే సమయంలో ఎన్నికల కోసం ప్రచార ఖర్చును కొందరు బడావ్యాపారులు భరించేలా కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఓ గ్రానైట్ వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నది ఆయనపై వచ్చిన ఆరోపణ.
అయితే.. సదరు వ్యాపారి భార్య.. ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో కౌశిక్ రెడ్డి విజయం దక్కించుకున్నాక.. తమను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వేధింపులతో వ్యాపారం కూడా చేసుకోలేకపోతున్నామని ఆమె చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాడిపై సదరు బాధితురాలు.. కేసు పెట్టారు. రూ.50 లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై పోలీసులు కేసు పెట్టారు. అయితే.. ఈ కేసు రాజకీయ కారణాలతో మోపారని.. తాను ఎవరినీ సొమ్ములు అడగలేదని కౌశిక్ రెడ్డి చెబుతున్నారు. ఈ కేసు కొట్టివేయాలని కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. కౌశిక్ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీనిపై విచారణ సాగించాలని.. నిజానిజాలు తేల్చాలని పోలీసులకుకూడా సూచించింది.
