Begin typing your search above and press return to search.

'సెలబ్రిటీలకు సంప్రదాయాలను అవమానించే హక్కు ఉండదు'

సెలబ్రిటీలు అయితే మాత్రం సంప్రదాయాల్ని.. సంస్క్రతిని అవమానించే హక్కు ఉండదన్న వ్యాఖ్య చేసిన కర్ణాటక హైకోర్టు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ తీరును తప్పు పట్టింది.

By:  Garuda Media   |   25 Feb 2026 10:22 AM IST
సెలబ్రిటీలకు సంప్రదాయాలను అవమానించే హక్కు ఉండదు
X

సెలబ్రిటీలు అయితే మాత్రం సంప్రదాయాల్ని.. సంస్క్రతిని అవమానించే హక్కు ఉండదన్న వ్యాఖ్య చేసిన కర్ణాటక హైకోర్టు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ తీరును తప్పు పట్టింది. గోవాలోని ఒక వేదికపై కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన కాంతారాను అనుకరిస్తూ చేసిన హావభావాలపై నమోదైన కేసు విచారణ తాజాగా కర్ణాటక హైకోర్టులో జరిగింది.

కాంతారను అనుకరిస్తూ రణ్ బీర్ ప్రదర్శించిన హావభాబాలతో పాటు.. దేవతలనను ఆడ దయ్యాలంటూ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పడుతూ న్యాయవాది ప్రశాంత్ మెథల్ ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ అంశంపై కేసు నమోదు చేసింది బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ రణ్ వీర్ సింగ్ ఇటీవల కోర్టును కోరారు. తాజా విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం రణ్ వీర్ సింగ్ చర్యల్ని తీవ్రంగా తప్పు పట్టారు. రణ్ వీర్ సింగ్ కానీ మరెవరైనా కానీ ఇతరుల సంప్రదాయాల్ని అవమానపరిచే హక్కు ఉండదని స్పష్టం చేశారు.

అందరూ హాజరైన వేదికలపై నోరు జారకుండా మరింత బాధ్యతగా వ్యవహరించాలన్న సూచన చేశారు. ఈ సందర్భంగా రణ్ వీర్ సింగ్ చేసింది పూర్తిగా అవగాహన లోపంతోనే అంటూ ఆయన తరఫు వాదనలు వినిపించారు ప్రముఖ న్యాయవాది సాజన్ పూవయ్య. ఇతరులను భాదించాలన్న ఉద్దేశం రణ్ వీర్ కు లేదని పేర్కొన్నారు. రణ్ వీర్ చేసిందంతా పూర్తిగా అవగాహన లోపంతోనే తప్పించి మరో కారణం లేదన్నారు. ఇతరులను బాధించాలన్న ఉద్దేశం అసలే లేదన్నారు. స్థానిక సంప్రదాయాలపై రణ్ వీర్ కు అవగాహన లేదని.. తాను చేసింది తప్పేనని వెంటనే క్షమాపణ చెప్పిన వైనాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లగా.. దీనికి ప్రతిగా వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది జగదీశ్ తన వాదనల్ని వినిపించారు.

కన్నడ నటి దీపికా పదుకొనే ద్వారా కర్ణాటక స్థానిక సంప్రదాయాలు.. విశ్వాసాలపై రణ్ వీర్ సింగ్ తెలుసుకొని ఉండాల్సిందన్నారు. అంతేకాదు.. ఈ ఈవెంట్ లో సాటి నటుడు రిషబ్ శెట్టి వారిస్తున్నా రణ్ వీర్ సింగ్ ఆపకుండానే అనుకరణ చేస్తూనే ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. దీన్ని మంచి ఉద్దేశమని అనగలమా? అంటూ ప్రశ్నను సంధించారు.

ఈ సందర్భంగా కలుగజేసుకున్న హైకోర్టు న్యాయమూరతి.. క్షమాపణ చెప్పినంతనే అంతకు ముందు చేసిందంతా సమిసిపోయినట్లేనని భావించలేమని చెప్పటంతో పాటు.. రణ్ వీర్ చేసిన అనుకరణకు చెందిన వీడియోలు ఇప్పటికి సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి కదా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా సినీ నటుడిపై కర్ణాటక పోలీసులు బలవంతపు చర్యలకు పాల్పడొద్దని పేర్కొంటూ.. అదే సమయంలో కోర్టు విచారణకు నటుడ్ని సహకరించాల్సిందిగా వారి తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు. తదుపరి విచారణ మార్చి 25కు (ఈ రోజుకు) వేశారు. ఈ కేసుపై హైకోర్టు ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.