పరువు కోసం మసాలా జోడించారు..నటి-ఎంపీ కంగనాపై సుప్రీం కన్నెర్ర
కంగనా రనౌత్ అంటేనే పెద్ద గొంతున్న వ్యక్తి. నటిగా ఉన్నప్పుడు కూడా చాలా తీవ్రస్థాయి ఆరోపణలు చేసేది.
By: Tupaki Desk | 12 Sept 2025 11:00 PM ISTబాలీవుడ్ లో ఉన్నంత కాలం విషయం కంటే వివాదంలోనే ఎక్కువగా కనిపించేవారు ఆమె... అలాగని రాజకీయాల్లోకి వచ్చాక ప్రజల్లో కంటే విమర్శల్లోనే కాలం గడుపుతున్నారు... మోదీ ప్రభుత్వ రెండో విడతలో తీవ్రంగా సాగింది మూడు సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమం. వీటిని నల్ల చట్టాలుగా పేర్కొంటూ రైతులు, రైతు సంఘాలు ఉద్యమించాయి. ఆ సమయంలో కంగనా రనౌత్ తీవ్ర విమర్శలకు దిగేవారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. అలాంటి ఓ పోస్ట్ వివాదాస్పదం అయింది. చివరకు పరువు నష్టం కేసు దాఖలైంది. దానిని కొట్టి వేయాలంటూ సుప్రీం కోర్టుకు వెళ్లగా చీవాట్లు పడాల్సి వచ్చింది.
వివాదాల మండి...
కంగనా రనౌత్ అంటేనే పెద్ద గొంతున్న వ్యక్తి. నటిగా ఉన్నప్పుడు కూడా చాలా తీవ్రస్థాయి ఆరోపణలు చేసేది. ఇక గత ఏడాది సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు కంగన. వాస్తవానికి రాజకీయాల్లోకి రావాలని భావించారో లేదో కానీ.. ఎన్నికలకు మూడేళ్లకు ముందే కంగన వివాదాస్పదంగా వ్యవహరిచండం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని రైతులు ముట్టడించారు. 2021 జనవరిలో అయితే ఏకంగా ఎర్రకోట వద్దకు చేరారు. రైతులు చేపట్టిన నిరసనలు రోజుల తరబడి సాగాయి.
వయసు కూడా చూడకుండి...
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిలో హిమాచల్, హరియాణా, పంజాబ్ రైతులే అధికం. 2021లో ఇలా మహీందర్ కౌర్ అనే మహిళ రైతుల ఆందోళనలో పాల్గొనగా... ఆమెపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహీందర్ కౌర్ వయసు 73 ఏళ్లు. ఆమె వయసులో సగం కూడా లేని కంగన... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ లో నిరసన ప్రదర్శన నిర్వహించిన బిల్కిస్ బానోతో పోల్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాక రీట్వీట్ కూడా చేశారు. దీంతో మహీందర్ కౌర్ ఫిర్యాదు మేరకు కంగనాపై పరువు నష్టం కేసు నమోదైంది.
కంగనాపై నమోదైన కేసును శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మీరు చేసింది రీ ట్వీట్ కాదు.. దానికి మసాలా జోడించారు.. అంటూ కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగనా పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పటికే హైకోర్టు కూడా ఇదే తరహా తీర్పు ఇచ్చింది.
