‘నా ఇంట్లోని స్టోర్ రూంలో క్యాష్ దొరికితే దోషిని ఎందుకవుతా?’
ఈ క్రమంలో ఆయన్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ పై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అభిశంసన తీర్మానం పెట్టాలని భావిస్తున్నారు.
By: Tupaki Desk | 19 July 2025 4:00 PM ISTకొన్ని నెలల క్రితం (మార్చి 14 రాత్రి) ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడటం.. ఆ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలోసగం కాలిన కరెన్సీ నోట్లు భారీగా బయటకు రావటం..అదో పెను సంచలనంగా మారటం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ పై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అభిశంసన తీర్మానం పెట్టాలని భావిస్తున్నారు.
ఈ ఇష్యూ పెను సంచలనంగా మారి సుప్రీంకోర్టుపై పెద్ద ఎత్తున విమర్శలు కురిపించినోళ్లు ఉన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కలిసి విచారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ విచారణ కమిటీలో పంజాబ్.. హర్యానా చీఫ్ జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్ జీఎస్ సంధావాలియా.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలాఉండగా.. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ తెర మీదకు వచ్చింది. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అధికారిక నివాసంలోని స్టోర్ రూంలో పెద్ద ఎత్తున నగదు కట్టలు దొరికినంత మాత్రమే తాను దోషిని ఎందుకు అవుతానని ఆయన వాదిస్తున్నారు. తన కెరీర్ లో ఎక్కడా మచ్చ అన్నది లేకుండా పదకొండేళ్లు న్యాయమూర్తిగా పని చేసిన వైనాన్ని ప్రస్తావించటం గమనార్హం.
విచాణ కమిటీ చేపట్టిన ప్రక్రియను తప్పు పడుతూ.. అదంతా లోపాలమయంగా పేరకొన్నారు. తన వాదన వినిపించుకోవటానికి తగినంత సమయం ఇవ్వలేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. తన అధికారిక నివాసంలో దొరికిన నోట్ల కట్టలకు యజమాని ఎవరన్నది కమిటీ గుర్తించలేదన్న ఆయన.. కొన్ని ఊహాగానాలతో ఒక ఆధారంగా వచ్చారని.. తన దృష్టిలో అవేమీ చెల్లవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగనుంది? సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది.
