Begin typing your search above and press return to search.

గాజు గ్లాస్...ఇప్పటికి ఇంతే బాసూ.. !

గాజు గ్లాస్ గుర్తు కామన్ సింబల్ చేయాలంటూ హై కోర్టుకు వెళ్ళిన జనసేనకు ఊరట దక్కలేదు.

By:  Tupaki Desk   |   1 May 2024 8:05 AM GMT
గాజు గ్లాస్...ఇప్పటికి ఇంతే బాసూ.. !
X

గాజు గ్లాస్ గుర్తు కామన్ సింబల్ చేయాలంటూ హై కోర్టుకు వెళ్ళిన జనసేనకు ఊరట దక్కలేదు. గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ కాబట్టే ఇండిపెండెంట్లకు దానికి కేటాయించామని ఈసీ కోర్టు ముందు తన వాదనలు వినిపించింది. ఇదంతా నిబంధనల మేరకు తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేసింది.

గుర్తింపు లేని పార్టీలకు కామన్ సింబల్ ఉండదు, ఆయా పార్టీలు పోటీ చేసే స్థానాలలో వారికి ఆ గుర్తు ఇచ్చినా మిగిలిన చోట్ల మాత్రం ఫ్రీ సింబల్ గానే ఉంటుందని ఎవరు కోరుకున్నా ఇస్తామని ఈసీ అంటోంది. దీని ప్రకారమే జరిగిందని కూడా స్పష్టం చేసింది.

ఇక జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్ల పరిధిలో మాత్రం గాజు గ్లాస్ సింబల్ ని వేరు ఎవరికీ ఇవ్వమని స్పష్టం చేసింది. దీంతో జనసేనకు స్వల్ప ఊరట అయితే దక్కింది. జనసేన మచిలీ పట్నం, కాకినాడ ఎంపీ సీట్లలో పోటీలో ఉంది. ఈ పరిధిలోని ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో మాత్రం జనసేన పోటీలో లేకపోయినా వేరే ఎవరికీ గాజు గ్లాస్ ఇవ్వరన్న మాట.

ఆ విధంగా చూసుకుంటే జనసేనకు కొంత మేరకే ఊరట దక్కింది అనుకోవాలి. మిగిలిన చోట్ల మాత్రం గాజు గ్లాస్ ఎవరికైనా ఇస్తామని స్పష్టం చేసింది. అయితే జనసేన వాదనలు కూడా ఇక్కడ బలంగానే ఉన్నాయి. తమకు గుర్తింపు లేకపోవచ్చు. కానీ రెండు గుర్తింపు కలిగిన పార్టీలతో తాము కలసి పొత్తు పెట్టుకున్నామని అందుకే తక్కువ సీట్లకు పోటీ చేస్తున్నామని మిగిలిన చోట్ల తమ ఓట్లు పొత్తు పార్టీలకు బదిలీ కావాలంటే కనుక గాజు గ్లాస్ గుర్తుని వేరే వారికి కేటాయిస్తే ఎలా అని ప్రశ్నించింది.

దానికి అయితే హై కోర్టు ఏమీ చెప్పలేదు, వేరే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. మొత్తానికి జనసేన పిటిషన్ డిస్పోజ్ చేసింది. ఇక ఏపీలో చూసుకుంటే ఇండిపెండెంట్లకు ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తుతో వారు చాలా దూకుడుగానే ఉన్నారు. తాము ఏ ప్రచారం చేసుకోకపోయినా కనీసంగా మూడు వేల దాకా ఓట్లు రావడం ఖాయమని కూడా భావిస్తున్నారు. ఇక లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, చంద్రబాబు కుప్పం, అలాగే సుజనా చౌదరి పోటీ చేస్తున్న విజయవాడ వెస్ట్, అచ్చెన్నాయుడు పోటీలో ఉన్న టెక్కలి, బాలయ్య పోటీలో ఉన్న హిందూపురం ఇలా కీలక నేతలు ఉన్న చోట ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు ఇచ్చేశారు.

దాంతో ఓట్ల చీలిక భయం అయితే టీడీపీ కూటమికి పట్టుకుంది అని అంటున్నారు. కానీ ఈసీ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్న విధానమే ఇక్కడ అనుసరించింది అని అంటున్నారు. దీని వెనక రాజకీయ కుట్ర కానీ మరేమీ కానీ లేవని అంటోంది. గుర్తింపు లేని పార్టీలను ఇండిపెండెంట్ల తో సమానంగానే చూస్తామని అంటోంది. అయితే జనసేనకు ఎక్కువ ప్రివిలేజ్ దక్కిందని అంటున్నారు. ఒక సారి ఒక గుర్తు తీసుకుని పోటీ చేసి ఆ గుర్తు మీద గుర్తింపునకు సరిపడా ఓట్లు తెచ్చుకోలేని పార్టీకి మరుసటి ఎన్నికల్లో అదే గుర్తుని ఇవ్వరు. కొత్త గుర్తునే ఇస్తారు.

కానీ జనసేనకు మాత్రం 2019 నుంచి ఒకే గుర్తుని ఇస్తోంది ఈసీ. అది ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అలాగే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈసీ జనసేనకు ఇలా మంచి చేసిందని అంటున్నారు. అపుడు సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరించింది కానీ మరీ కామన్ సింబల్ గా ఇవ్వమంటే అది సార్వత్రిక ఎన్నికల్లో అంటే అది ఈసీ రూల్స్ కే వ్యతిరేకం అని అంటున్నారు. అందుకే అలా చేశారు అని అంటున్నారు. -

అయితే కొత్త పార్టీలు ఎపుడూ పూర్తిగా తమ సామర్ధాన్ని నిరూపించుకునేందుకు అలాగే గుర్తు కోసం మొత్తానికి మొత్తం సీట్లకు పోటీ చేస్తాయి. కానీ జనసేన 2019లో తొలిసారి పోటీ చేసినపుడు కూడా మొత్తం ఏపీలో 175 సీట్లకు గానూ 137కే పోటీ చేసింది. పొత్తులతోనే వచ్చింది అని గుర్తు చేస్తున్నారు.

అదే అన్న గారు 1983లో పార్టీ పెట్టినపుడు సంజయ్ విచార్ మంచి అన్న పార్టీకి రెండు సీట్లు ఇచ్చారు. తప్ప మొత్తం ఉమ్మడి ఏపీలో 294 కి 292 సీట్లు పోటీ చేశారు అని గుర్తు చేస్తున్నారు. గుర్తు పొందలేకపోవడం జనసేన స్వీయ తప్పిదం తప్ప కుట్ర ఏమీ దీని వెనకాల లేదు అనే అంటున్నారు.