Begin typing your search above and press return to search.

నిమిషాప్రియా, మరో ముగ్గురు భారతీయులకు ఉరిశిక్షలు.. రంగంలోకి కేంద్రం

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిషాప్రియకు, ఇండోనేషియాలో మరో ముగ్గురు భారతీయులకు విధించిన ఉరిశిక్షలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

By:  Tupaki Desk   |   14 July 2025 3:04 PM IST
నిమిషాప్రియా, మరో ముగ్గురు భారతీయులకు ఉరిశిక్షలు.. రంగంలోకి కేంద్రం
X

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిషాప్రియకు, ఇండోనేషియాలో మరో ముగ్గురు భారతీయులకు విధించిన ఉరిశిక్షలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వారి ప్రాణాలను కాపాడేందుకు చివరి నిమిషంలో దౌత్యపరమైన, చట్టపరమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు కేసుల్లోనూ సవాళ్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భారత పౌరుల ప్రాణాలను రక్షించడానికి కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది.

నిమిషాప్రియా కేసు.. ప్రాణాలకు ముప్పు

కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిషాప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయబోతుండటంతో భారత ప్రభుత్వం ఉరుకులు పరుగుల మీద ఉంది. 2017లో యెమెన్‌లో తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తికి మత్తుమందు ఇచ్చి, అనుకోకుండా అతని మరణానికి కారణమైందన్న ఆరోపణలతో ఆమెపై షరియా చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించారు. మృతదేహాన్ని ట్యాంక్‌లో పడేయడం, ఆ తర్వాత ఆమె సౌదీ అరేబియాకు పారిపోతుండగా అరెస్ట్ కావడం ఈ కేసులో కీలక పరిణామాలు.

"బ్లడ్ మనీ" చర్చలు – చివరి ప్రయత్నం

యెమెన్‌లో "బ్లడ్ మనీ" అనే షరియా చట్టం ప్రకారం, బాధితుడి కుటుంబానికి పరిహారం చెల్లిస్తే నిందితులను క్షమించే అవకాశం ఉంటుంది. నిమిషాప్రియ కుటుంబం ఈ విషయంలో సుమారు రూ. 8.6 కోట్లు (ఒక మిలియన్ డాలర్లు) చెల్లించడానికి సిద్ధంగా ఉంది. అయితే, బాధితుడి కుటుంబం నుండి ఇంకా స్పష్టత రాలేదు. భారత సుప్రీంకోర్టు కూడా ఈ కేసుపై జూలై 14న విచారణ చేపట్టనుంది. దురదృష్టవశాత్తు భారత్‌కు యెమెన్‌తో ప్రస్తుతం దౌత్య సంబంధాలు లేకపోవడం వల్ల ప్రభుత్వపరంగా జోక్యం చేసుకోనే అవకాశాలు చాలావరకు నిస్సహాయంగా మారాయి.

- కేంద్రం స్పందన

నిమిషాప్రియ కేసులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడిస్తూ "భారత-యెమెన్ మధ్య దౌత్య సంబంధాలు లేకపోవడం వల్ల పెద్దగా మార్గాలేమీ మిగిలినట్టు లేదు" అని తెలిపింది. బ్లడ్ మనీ చర్చలు పూర్తిగా వ్యక్తిగత స్థాయిలోనే జరుగుతున్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా సైతం, "ఈ ఘటన పరిణామం ఆందోళన కలిగించేదిగా ఉంది. ఆమె ప్రాణాలు కోల్పోతే అది బాధాకరమైన విషయం" అని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ వాయిదా వేయడం వల్ల జూలై 16కు ముందు తుది నిర్ణయం తీసుకోవాలన్న ఒత్తిడి పెరుగుతోంది.

-ఇండోనేషియాలో మరో కేసు.. ముగ్గురు భారతీయులకు ఉరిశిక్ష

ఇదే తరహాలో ఇండోనేషియాలో మరో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పట్టుబడ్డ రాజు ముత్తుకుమరన్, సెల్వదురై దినకరన్, గోవిందసామి విమల్కందన్ అనే ముగ్గురు భారతీయులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. రియావు దీవుల సమీపంలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వారు పట్టుబడ్డారు. అక్కడి స్థానిక కోర్టుతో పాటు హైకోర్టు కూడా ఈ శిక్షను సమర్థించాయి.

- భారత రాయబారి స్పందన.. విచారణలో లోపాలు

ఈ కేసుపై భారత రాయబారి సందీప్ చక్రవర్తి స్పందిస్తూ కేసు విచారణలో తీవ్ర లోపాలున్నాయని పేర్కొన్నారు. మొబైల్ రికార్డులు, ఇతర కీలక ఆధారాలు పరిగణనలోకి తీసుకోలేదని, సాక్షులను తిరిగి విచారించాలని కోరుతూ దర్యాప్తు పునర్విమర్శకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వీరిని ఉరిశిక్ష నుండి తప్పించేందుకు భారత ప్రభుత్వం దౌత్య మార్గాల్లో ఒత్తిడి తీసుకొస్తోంది.

నిమిషాప్రియా , ఇండోనేషియాలో శిక్ష ఎదుర్కొంటున్న ముగ్గురు భారతీయుల విషయంలో ఆఖరి నిమిషాల దౌత్య ప్రయత్నాలే ఒక్కటై మిగిలాయి. ప్రాణాలను కాపాడే చివరి ప్రయత్నంగా బ్లడ్ మనీ చర్చలు, కేసుల పునర్విమర్శకు భారత ప్రభుత్వం విశ్వాసంతో కృషి చేస్తోంది. అయితే, చట్టపరమైన పరిమితులు, కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ సంబంధాల లోపం ఈ ప్రయత్నాలకు అడ్డుగానే నిలుస్తున్నాయి. ఈ విషయంలో చివరి నిర్ణయం వచ్చే వరకు దేశవ్యాప్తంగా చర్చ, ఆందోళన కొనసాగనుంది.