Begin typing your search above and press return to search.

క్రిమినల్‌ కేసు పెండింగ్‌ : పాస్‌ పోర్ట్‌ జారీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు!

పాస్‌ పోర్టు కోసం తాను చేసుకున్న దరఖాస్తును వారణాసిలోని పాస్‌ పోర్ట్‌ సేవా కేంద్రం తిరస్కరించిందని పిటిషనర్‌ ఆకాశ్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు.

By:  Tupaki Desk   |   20 Oct 2023 9:03 AM GMT
క్రిమినల్‌ కేసు పెండింగ్‌ : పాస్‌ పోర్ట్‌ జారీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు!
X

భారతీయులు ఎవరైనా విదేశీయానం చేయాలంటే అందుకు తమకు అభ్యంతరం లేదని భారత ప్రభుత్వం జారీ చేసే అధికారిక ధ్రువీకరణ.. పాస్‌ పోర్ట్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పాస్‌ పోర్టుల జారీకి సంబంధించి ప్రభుత్వం అనేక నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా క్రిమినల్‌ కేసులు ఉన్నవారికి దాదాపు పాస్‌ పోర్టులు ఇవ్వరు.

ఈ నేపథ్యంలో క్రిమినల్‌ కేసులు నమోదై ఉండి పాస్‌ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి అలహాబాద్‌ హైకోర్టు ఊరటనిచ్చింది. దరఖాస్తుదారుడిపై క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉందన్న కారణంతో పాస్‌ పోర్ట్‌ కోసం పెట్టుకున్న దరఖాస్తును నిలిపివేయలేమని తీర్పునిచ్చింది.

ఈ మేరకు అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ మహేష్‌ చంద్ర త్రిపాఠి, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. పాస్‌ పోర్ట్‌ జారీ కోసం పిటిషనర్‌ పెట్టుకున్న దరఖాస్తుపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ లోని జౌన్‌ పూర్‌ జిల్లాకు చెందిన ఆకాష్‌ కుమార్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ పై కోర్టు తీర్పు వెలువరించింది.

పాస్‌ పోర్టు కోసం తాను చేసుకున్న దరఖాస్తును వారణాసిలోని పాస్‌ పోర్ట్‌ సేవా కేంద్రం తిరస్కరించిందని పిటిషనర్‌ ఆకాశ్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తనకు పాస్‌ పోర్టు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే పోలీసు వెరిఫికేషన్‌ రిపోర్టు స్పష్టంగా లేనందున అతడి దరఖాస్తును తిరస్కరించామని పాస్‌ పోర్టు సేవా కేంద్రం తెలిపింది.

కేవలం క్రిమినల్‌ కేసు ఆధారంగా పాస్‌ పోర్టును తిరస్కరించడం కుదరదని సుప్రీంకోర్టుతో పాటు అలహాబాద్‌ హైకోర్టు కూడా గతంలో తీర్పులిచ్చాయని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ మేరకు బసూ యాదవ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (2022) కేసులో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఉటంకించారు.

ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుడిపై క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉందన్న కారణంతో.. అతడి పాస్‌ పోర్ట్‌ దరఖాస్తును నిలుపుదల చేయలేమని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్‌ దరఖాస్తుపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.