Begin typing your search above and press return to search.

బెట్టింగ్ యాప్స్ : ఎవ్వరినీ వదలడం లేదు కదా

అది దేన్ని వదలడం లేదు. ఎవ్వరినీ ఉపేక్షించడం లేదు. .చోటా మోటా నటులతో మొదలైన ఈ బెట్టింగ్ యాప్ కేసులు స్టార్ హీరోల వరకూ పాకింది

By:  Tupaki Desk   |   24 April 2025 8:12 PM IST
బెట్టింగ్ యాప్స్ : ఎవ్వరినీ వదలడం లేదు కదా
X

బెట్టింగ్ అంటే అదో విష వృక్షం. అది దేన్ని వదలడం లేదు. ఎవ్వరినీ ఉపేక్షించడం లేదు. .చోటా మోటా నటులతో మొదలైన ఈ బెట్టింగ్ యాప్ కేసులు స్టార్ హీరోల వరకూ పాకింది. ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలోని కీలక విభాగాలకు విస్తరించింది.చూస్తుంటే ఈ బెట్టింగ్ కేసులు ఎవ్వరినీ వదిలేలా కనిపించడంలేదు.

హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల ప్రదర్శనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయమై హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

న్యాయవాది నాగూర్ బాబు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్‌లను చట్టవిరుద్ధంగా ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌పై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని కూడా ఆయన కోర్టును కోరారు. మెట్రో రైళ్లు ప్రజారవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, అలాంటి సంస్థ ఇటువంటి అక్రమాలకు పాల్పడటం సరికాదని పిటిషనర్ వాదించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటోంది. పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసింది. మెట్రో రైలు కోచ్‌లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు ప్రముఖంగా కనిపించడంపై గతంలో పలువురు సామాజిక కార్యకర్తలు, విజిలెన్స్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా, ఈ వ్యవహారంపై హైకోర్టు స్పందించి మెట్రో రైలు అధికారులకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.