బర్త్‌డే కేక్ చేతులతో తండ్రికి తలకొరివి.. జడ్జిని కదిలించిన కేసు
వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ.. సమాజంలోని అవినీతిని కడిగేస్తూ..తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కీలక తీర్పు ఇచ్చారు.
By: Tupaki Desk | 22 Aug 2025 10:45 PM ISTవ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ.. సమాజంలోని అవినీతిని కడిగేస్తూ..తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కీలక తీర్పు ఇచ్చారు. పుట్టిన రోజున కేక్ కేయాల్సిన ఆ తొమ్మిదేళ్ల పిల్లాడి చేతులు తండ్రికి తలకొరివిపెట్టాయి.. అది నన్ను కలచివేసింది అంటూ ఆయన భావోద్వేగంతో చలించిపోయారు. ఒక హైకోర్టు జడ్జిని ఇంతగా కదిలించిన కేసు ఇటీవలి సంచలన పరిణామం నుంచి వచ్చింది.
ఇటీవల హైదరాబాద్ రామంతపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఊరేగింపు రథానికి కేబుల్ వైరు తగిలి ఐదుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కలకలం రేపింది. అందులోనూ ముందుముందు వినాయక చవితి వంటి పెద్ద పండుగలు ఉండగా ఇలా జరగడం చర్చనీయమైంది. ఈ నేపథ్యంలోనే కరెంటు స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. దీనిపై ప్రముఖ సెల్ సేవల నెట్‌వర్క్ భారతి ఎయిర్‌టెల్.. హైకోర్టులో పిటిషన్ వేసింది. కొద్ది రోజుల కిందట దీనిపై విచారణ జరిగింది. జస్టిస్ భీమపాక నగేష్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?
రామంతపూర్ ఘటనను ప్రస్తావిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం ఏమిటంటూ జస్టిస్ భీమపాక నగేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామంతాపూర్ దుర్ఘటనలో 9 ఏళ్ల పిల్లాడి తండ్రి చనిపోయాడని, ఆ పిల్లాడు తన పుట్టిన రోజే తండ్రికి తలకొరివి పెట్టాల్సి వచ్చిందని ఈ ఉదంతం తనను కదిలించిందని న్యాయమూర్తి ఉద్వేగంగా స్పందించారు. విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులుపుకొంటే ఎలాగని నిలదీశారు. తన హృదయం ముక్కలైందని.. ప్రజల ప్రాణాలకు దిక్కెవరని ప్రశ్నించారు. ఇలాంటివాటికి అందరం బాధ్యులమేనని, సమాజం సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. చలనం లేని చట్టాలతో ప్రజల ప్రాణాలను కాపాడగలమా? అని అన్నారు.
లైసెన్‌్స ఉన్న కేబుళ్లే ఉంచాలి..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అనుమతి (లైసెన్స్) పొందిన కేబుళ్లు తప్ప ఏవీ ఉండొద్దని జస్టిస్ భీమపాక నగేష్ ఆదేశించారు. కాగా, కేసులో వాదోపవాదాల సందర్భంగా భారతి ఎయిర్‌టెల్ తరఫు పిటిషనర్ల వాదనలపై న్యాయమూర్తి మండిపడ్డారు. తీగల బరువుతో స్తంభాలు ఒరిగిపోతున్నట్లు వారు చెప్పగా... ‘‘మామూళ్ల మత్తులో కొందరు ఉద్యోగుల జేబుటు బరువెక్కుతున్నాయి’’ అని కటువుగా వ్యాఖ్యానించారు. స్తంభాలపై తీగలు నల్లగా ఉన్నందున గుర్తుపట్టలేకపోయామని పిటిషనర్ పేర్కొనగా.. ‘‘కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీ బొమ్మను మాత్రం బాగా గుర్తుపడతారు’’ అంటూ చురకేశారు. ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం కాదని, రామంతాపూర్ వంటి దుర్ఘటనలు పునరావృతం కావొద్దని స్పష్టం చేశారు.
