Begin typing your search above and press return to search.

భార్యకు భరణం.. భర్తకు ఊహించని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు!

ఓ భర్త భార్యాబిడ్డలకు భరణం చెల్లించకుండా తప్పించుకుందామనుకున్నడు,కానీ సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

By:  Madhu Reddy   |   7 March 2026 12:24 PM IST
భార్యకు భరణం.. భర్తకు ఊహించని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు!
X

ఓ భర్త భార్యాబిడ్డలకు భరణం చెల్లించకుండా తప్పించుకుందామనుకున్నడు,కానీ సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సాధారణంగా కోర్టులు భరణం చెల్లించాలని ఆదేశిస్తాయి, కానీ ఈ కేసులో ఏకంగా భర్త పనిచేసే కంపెనీకే కీలక ఆదేశాలు జారీ చేసింది. తన జీతం నుంచి నేరుగా భార్య ఖాతాకు డబ్బులు బదిలీ చేయాలని ఆదేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ అరుదైన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలుఈ కేసులో ఏం జరిగిందో వివరంగా చూద్దాం.

భర్త మొండితనం.. కోర్టు కఠిన నిర్ణయం:

నిశాంత్ ప్రవీణ్ భాయ్ సోనీ, డింపుల్ దంపతుల మధ్య తలెత్తిన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. భార్యకు, నాలుగేళ్ల కుమార్తెకు భరణం చెల్లించాలని గతంలోనే కోర్టు ఆదేశించినప్పటికీ, నిశాంత్ మాత్రం ససేమిరా అన్నాడు. ఇక తనకు నెలకు రూ. 50,000 మాత్రమే జీతం వస్తుందని, లోన్లు ఎక్కువగా ఉన్నాయని సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కనీసం మధ్యవర్తిత్వ చర్చల కోసం ప్రయాణ ఖర్చులు ఇవ్వమన్నా, బకాయిలు ఉన్న రూ. 2.5 లక్షలు కట్టమన్నా అతను అంగీకరించలేదు. ఇక దీంతో జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మొండితనానికి ముగింపు పలకాలని నిర్ణయించింది.

జీతం నుంచి నేరుగా కటింగ్:

భర్త స్వచ్ఛందంగా డబ్బులు కట్టడం లేదని గ్రహించిన సుప్రీంకోర్టు, అతను పనిచేస్తున్న 'రిషాద్ షిప్పింగ్ అండ్ క్లియరింగ్ ఏజెన్సీ' కంపెనీకి నేరుగా నోటీసులు ఇచ్చింది. నిశాంత్ నెల జీతం నుంచి రూ. 25,000 కట్ చేసి, ఆ మొత్తాన్ని నేరుగా అతని భార్య ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేయాలని ఆదేశించింది. ఇక ఇలాంటి తీర్పులు చాలా అరుదుగా వస్తుంటాయి. భర్తకు లోన్లు ఉన్నా లేకపోయినా, భార్యాబిడ్డల సంక్షేమమే అత్యున్నతమని కోర్టు స్పష్టం చేసింది. గత నాలుగేళ్లుగా తండ్రి తన బిడ్డను కనీసం పలకరించలేదని, ఆమె తండ్రి కూడా చనిపోయి ఒంటరిగా బిడ్డను పెంచుతోందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

పిల్లల సంక్షేమమే పరమావధి:

సుప్రీంకోర్టు ఈ తీర్పులో మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. కేవలం చట్టాల గురించి కాకుండా, చిన్నారి భవిష్యత్తు మరియు సంక్షేమం గురించి తాము ఎక్కువ ఆందోళన చెందుతున్నామని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇక 2022లో విడిపోయినప్పటి నుండి భార్య ఒంటరి పోరాటం చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో భర్త సాకులు చెప్పడం చెల్లదని తేల్చి చెప్పింది. ఈ తీర్పు భరణం విషయంలో కాలయాపన చేసే వారికి ఒక హెచ్చరికలా నిలుస్తుంది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తే ఇలాంటి 'డైరెక్ట్ యాక్షన్' తప్పదని ఈ ఘటన నిరూపించింది. కుటుంబ బాధ్యతల నుండి తప్పించుకోవాలనుకునే వారికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక కనువిప్పు లాంటిది. న్యాయం ఎప్పుడూ బాధితుల పక్షాన ఉంటుందని ఇది మరోసారి నిరూపించింది.