జగన్ కారు ప్రమాదం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసుపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది.
By: Tupaki Desk | 27 Jun 2025 2:07 PM ISTరెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతి కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా ఈ కేసులో జగన్ ను ఏ2గా చేర్చడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది!
అవును... సత్తెన్నపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో... జగన్ కాన్వాయ్ వల్లే అతను మరణించాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల జాబితాలో ఏ2గా జగన్ ను చేర్చారు. దీంతో... ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంటూ జగన్ క్వాష్ పిటిషన్ వేశారు.
ఇదే కేసులో నిందితులుగా డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రులు పేర్ని నాని, విడదల రజని ఉన్నారు. వీరంతా వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది! ఈ సందర్భంగా... విచారణను జూలై 1కి వాయిదా వేసింది కోర్టు. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా స్పందించిన ఉన్నత న్యాయస్థానం... "కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?.. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో కూడా తొక్కిసలాట ఘటన జరిగింది కదా?" అని హైకోర్టు వ్యాఖ్యానించింది!
జగన్ కారును తనిఖీ చేసిన అధికారులు!:
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40 డీహెచ్ 2349 కారు ఫిట్ నెస్ ను ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు. కాగా... ఈ కారును ఇటీవల జగన్ నివాసం నుంచి పోలీసులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే!
