ఆ 'శవం'తో రాజకీయం చేస్తారా?: కేంద్రంపై హైకోర్టు ఫైర్
ఇటీవల రెండు రోజుల కిందట ఛత్తీస్‌గఢ్‌లో `ఆపరేషన్ కగార్` పేరుతో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు నిర్వహించిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నాయకులు మృతి చెందారు.
By: Tupaki Desk | 24 May 2025 3:19 PM IST''ఆ శవంతో మీరు ఏం చేయాలని అనుకున్నారు. రాజకీయ నాయకుల మాదిరిగా రాజకీయం చేయాలని భావిస్తున్నారా? చట్టం అంటూ ఒకటి ఉందని తెలుసా? దాని ప్రకారం నడుచుకునేందుకే మీరు యూనిఫాం వేసుకున్నారన్న విషయాన్ని ఎన్ని సార్లు గుర్తు చేయాలి. మీ ఇష్టానుసారం వ్యవహరించాలని అనుకుంటే జైలుకు వెళ్లండి. అక్కడ చట్టం అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది.''- ఈ మాటలు అన్నది సాక్షాత్తూ హైకోర్టు. ఎవరిని ఉద్దేశించి అన్నదంటే.. ఛత్తీస్‌గఢ్, ఏపీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి!!.
ఎందుకు?
ఇటీవల రెండు రోజుల కిందట ఛత్తీస్‌గఢ్‌లో `ఆపరేషన్ కగార్` పేరుతో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు నిర్వహించిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నాయకులు మృతి చెందారు. వీరిలో మోస్ట్ వాంటెండ్, అదేవిధంగా మావోయిస్టు పార్టీని ముందుండి నడిపిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు.. ఉరవ్ బసవరాలు, అదేవిధంగా మరో అగ్ర నేత, మావోయిస్టు కీలక ఆపరేషన్ వ్యూహకర్త సజ్జా నాగేశ్వరరావు ఉన్నారు. అయితే.. వీరి కుటుంబ సభ్యులు వారి మృత దేహాలను తమకు ఇవ్వాలని పోలీసులను వేడుకున్నారు.
ఈ క్రమంలో మానవ హక్కుల పోరాట సమితితో కలిసి కేంద్రానికి కూడా లేఖ రాశారు. కానీ, అటు ఛత్తీస్ గఢ్ పోలీసులు.. ఇటు ఏపీ పోలీసులు కూడా వారిని కనీసం మృత దేహాలను చూసేందుకు కూడా అనుమతించలేదు. పైగా ఎదురు కేసులు పెట్టి బొక్కలో వేస్తామని శ్రీకాకుళం ఎస్పీ తమను బెదిరించారని కేశవరావు సోదరుడు ఢిల్లీశ్వరరావు, తల్లి భారతమ్మలు ఆరోపించారు. ఈ క్రమంలోనే వారు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారమే.. హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా దీనిని విచారించిన కోర్టు.. పైవిధంగా పోలీసులు... కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శవాలతో రాజకీయం చేయాలని అనుకుంటున్నారా? అని నిలదీసింది. ఎన్ కౌంటర్ బూటకమో కాదో.. తాము తేల్చే పనిలో లేమన్న కోర్టు.. మృత దేహాలను మానవీయ కోణంలో అయినా.. ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించింది. తక్షణమే వారి కుటుంబాలకు మృత దేహాలను అప్పగించాలని.. అన్నిరికార్డు చేయాలని ఆదేశించింది.
