ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట.. తెలంగాణ హైకోర్టు అనూహ్య నిర్ణయం
ఓబులాపురం మైనింగు కేసులో శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఊరట లభించింది.
By: Tupaki Desk | 11 Jun 2025 3:20 PM ISTఓబులాపురం మైనింగు కేసులో శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఊరట లభించింది. ఆయనతోపాటు ఈ కేసులో దోషులుగా తేలిన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలుశిక్షను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అదే సమయంలో దేశం విడిచి వెళ్లకూడదని, రూ.10 లక్షల సొంత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది.
పదిహేనేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గత నెల 6న నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితులైన బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, వి.డి. రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్ పై అభియోగాలు రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన గనులశాఖ మాజీ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్ కు అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో నిందితులు అప్పీలు చేయడంతో హైకోర్టు విచారించి సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది.
ఇప్పటికే గాలి జానార్దన్ రెడ్డి మూడున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించారని, మరో మూడున్నరేళ్ల శిక్ష మాత్రమే మిగిలి ఉంది. కాగా, తాను ఎమ్మెల్యేగా ఉన్నందున శిక్షను వాయిదా వేయాలని జనార్దనరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. కేసును పునర్విచారించాలని కోరారు. అదేసమయంలో ఆయన పెట్టుకున్న బెయిల్ విషయంలో సీబీఐ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ జైలు శిక్షను సస్పెండ్ చేసే విషయంలో మాత్రం వ్యతిరేకత చూపింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు గాలి జనార్దన్ రెడ్డి శాసనసభ సభ్యత్వం పోకుండా తీర్పు ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.