జైలుకు పంపిస్తాం జాగ్రత్త.. గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సీరియస్!
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.
By: Tupaki Desk | 16 April 2025 3:33 PM ISTహైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చెట్లు నరికివేసే ముందు 1996లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే చీఫ్ సెక్రటరీతో సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.ఒకవేళ వారిని కాపాడాలనుకుంటే, విధ్వంసానికి గురైన 100 ఎకరాల భూమిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రభుత్వ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు ఆదేశాల మేరకు పనులన్నీ నిలిపివేశామని తెలిపారు. చెట్లను నరికివేయడానికి ప్రభుత్వానికి సంబంధిత అధికారుల నుండి అనుమతి ఉందా అని కోర్టు అడిగింది.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, ఆ భూముల్లోని జామాయిల్ తరహా చెట్లు.. పొదలను అనుమతులతోనే తొలగించినట్లు తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ కోర్టుకు వివరించారు. అయితే, 1996 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఏమాత్రం ఉల్లంఘించినా చూస్తూ ఊరుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా అమికస్ క్యూరీ మాట్లాడుతూ, సీఈసీ నివేదికలో ఆ భూములను రూ.10 వేల కోట్లకు తనఖా పెట్టినట్లు పేర్కొన్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ బీఆర్ గవాయ్, ఆ భూములను తనఖా పెట్టారా లేదా విక్రయించారా అనేది తమకు అనవసరమని తేల్చిచెప్పారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనే విషయం మాత్రమే ముఖ్యమని ఆయన అన్నారు. వందల ఎకరాల అడవులు నాశనం అవుతున్నాయనే విషయాన్ని మాత్రమే మేము గమనిస్తున్నాము. మీరు ఏదైనా చర్య తీసుకోవాలంటే, అందుకు తగిన అనుమతులు కలిగి ఉండాలి అని వారు తెలిపారు.
అభిషేక్ మనుసింఘ్వీ 2004 నుంచి ఈ భూముల వ్యవహారం, వివిధ కోర్టుల్లో ఉన్న పరిస్థితి, ఆ తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి వంటి వివరాలను ధర్మాసనానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, ఈ వ్యవహారంలో స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. దీంతో గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
