Begin typing your search above and press return to search.

ఈడీకి సుప్రీం మొట్టికాయలు.. తెరపైకి సంచలన వ్యాఖ్యలు!

అవును... కర్ణాటకలోని వందల కోట్ల రూపాయల విలువైన మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంయూడీఏ) కుంభకోణానికి సంబంధించి.. ఈడీ కి నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

By:  Tupaki Desk   |   21 July 2025 4:01 PM IST
ఈడీకి సుప్రీం మొట్టికాయలు.. తెరపైకి సంచలన వ్యాఖ్యలు!
X

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల చేతుల్లో జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు ఉంటున్నాయనే చర్చ ఎప్పటినుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులపై అధికార పార్టీలు కక్షసాధింపు చర్యలకు దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది.

అవును... కర్ణాటకలోని వందల కోట్ల రూపాయల విలువైన మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంయూడీఏ) కుంభకోణానికి సంబంధించి.. ఈడీ కి నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతికి సమన్లు జారీ చేయడాన్ని క్వాష్‌ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించగా.. ఆ నిర్ణయాన్ని ఈడీ సుప్రీంలో సవాలు చేసింది. దీనిని తాజాగా సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె వినోద్‌ చంద్రన్‌ లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలని.. అసలు అలాంటి పోరాటాలకు ఈడీని ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించింది.. ఇది సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు స్పందిస్తూ.. తాము పిటిషన్‌ ను ఉపసంహరించుకొంటామని పేర్కొన్నారు. అనంతరం... కోర్టు పిటిషన్‌ ను తిరస్కరించింది. ఈ సందర్భంగా... హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జడ్జి తీసుకొన్న నిర్ణయంలో ఎటువంటి లోపం లేదని స్పష్టం చేసింది.

కాగా... మైసూరులోని కెసరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతికి మూడు ఎకరాల భూమి ఉండేది. ఆమె సోదరుడు దానిని ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ఎంయూడీఏ దానిని స్వాధీనం చేసుకుంది. పరిహారంగా విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది.

అయితే... ఎంయూడీఏ కెసరెలో తీసుకున్న ల్యాండ్‌ తో పోలిస్తే.. విజయనగరలో భూమి మార్కెట్‌ ధర చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. అదే విమర్శలకు కారణమైంది. దీంతో.. ఆమె ఆ భూమిని సరెండర్‌ చేశారు. ఈ క్రమంలో పార్వతికి ఈడీ జారీ చేసిన సమన్లను హైకోర్ట్‌ సింగిల్‌ బెంచ్‌ జడ్జి నాగ ప్రసన్న క్వాష్‌ చేశారు. తాజాగా దీనిపైనే ఈడీ సుప్రీంలో అప్పీల్‌ చేసింది.

ఈ నేపథ్యంలోనే సీజేఐ తో కూడిన ధర్మాసనం... "దురదృష్టవశాత్తూ నాకు మహారాష్ట్రలో అనుభవం ఉంది.. మేము మాట్లాడేటట్లు ఒత్తిడి చేయొద్దు.. ఒకవేళ అలాచేస్తే.. మేము ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గురించి కఠిన విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల్లో రాజకీయ యుద్ధాలు చేసుకోనివ్వండి.. మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు..?” అని ప్రశ్నించింది.