Begin typing your search above and press return to search.

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు: దోషుల ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

By:  Tupaki Desk   |   8 April 2025 12:38 PM IST
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు: దోషుల ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కోర్టు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. తద్వారా ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 18 మంది ప్రాణాలు కోల్పోగా 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు 2016 డిసెంబర్ 13న ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు.

ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను ధృవీకరించాలని కోరుతూ ఆ తీర్పును హైకోర్టుకు నివేదించగా, నిందితులు కూడా కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని అప్పీళ్లు దాఖలు చేశారు. జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీళ్లపై సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం, మంగళవారం ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ తుది తీర్పును వెలువరించింది.

-ఉలిక్కిపడిన హైదరాబాద్ నగరం:

2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాప్, మిర్చిపాయింట్ వద్ద 100 మీటర్ల దూరంలో రెండు బాంబులు పేలాయి. మొదటి బాంబు కోనార్క్ థియేటర్ ఎదురుగా ఉన్న ఆనంద్ టిఫిన్స్ వద్ద పేలగా, రెండో బాంబు వెంకటాద్రి థియేటర్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టాండ్ మధ్య పేలింది. ఉగ్రవాదులు సైకిళ్లపై బాంబులు అమర్చారని, పేలుళ్లలో ఐరన్ బోల్ట్‌లు, అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించారని పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగి యాసిన్ భత్కల్‌తో సహా పలువురు నిందితులను అరెస్టు చేసింది.

హైకోర్టు తాజా తీర్పు దేశంలో ఉగ్రవాద దాడులపై జరుగుతున్న న్యాయ పోరాటంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల బాధితులకు కొంత ఊరట లభించినట్లయింది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇంకా పరారీలో ఉండటం గమనార్హం. మిగిలిన ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు కావడంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లయింది.